Jun 23,2022 06:34

రాష్ట్రపతి ఎన్నికల వేళ మహారాష్ట్రలో చోటుచేసుకున్న సంక్షోభం దిగజారుతున్న రాజకీయ విలువలకు నిదర్శనం. సోమవారం జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల వరకు ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేతోనే కలిసి ఉన్న శాసనసభ పక్షనేత ఏకనాథ్‌ షిండే తిరుగుబాటు ప్రకటించడం, పెద్ద సంఖ్యలో ఎంఎల్‌ఏలతో రాత్రికి రాత్రే మరో రాష్ట్రానికి ఉడాయించడం వంటి పరిణామాలు జాతీయ స్థాయిలో కలకలం రేపాయి. ఈ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని బిజెపి నేతలు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవమేమిటో జరుగుతున్న సంఘటనలు గమనిస్తున్న వారెవ్వరికైనా ఇట్టే అర్ధమవుతుంది. రాష్ట్రాలలో తమ ఏలుబడి లోని ప్రభుత్వమైనా ఉండాలి, లేదా తమ కనుసన్నల్లో నడుస్తూ అడుగులకు మడుగులొత్తే ప్రభుత్వమైనా ఉండాలన్నది బిజెపి, సంఫ్‌ుపరివార్‌ లక్ష్యం. అందుకోసం ఆపరేషన్‌ కమల్‌ను గతంలో అమలు చేసి కర్ణాటక, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసింది. మహారాష్ట్ర లోనూ ఈ దిశలో ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించి విఫలమైంది. శివసేనలో చోటుచేసుకున్న అసంతృప్తిని ఆసరా చేసుకుని మరింత పక్కాగా మూడోసారి పడగ విసిరిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దవ్‌ఠాక్రే ఈ సారి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగం కూడా ఈ కోవలోనే సాగడం గమనార్హం. రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని, సి.ఎం నివాస భవనం కూడా ఖాళీ చేస్తానని అన్నారు. తనతో చర్చలకు రావాలని తిరుగుబాటు నేత షిండేను ఆహ్వానించారు. అయితే, చర్చలు దాదాపు అసాధ్యమే!
        సోమవారం సాయంత్రం వరకు కూడా ముఖ్యమంత్రి ఠాక్రేతోనే ఉన్న షిండే, ఆ తరువాత గంటల వ్యవధిలోనే కొందరు ఎంఎల్‌ఏలను సమీకరించి, ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు తరలించడంతోనే ఈ వ్యవహారంలో బిజెపి ప్రమేయం స్పష్టమౌతోంది. పదుల సంఖ్యలో ఎంఎల్‌ఏలు ఒక్కసారిగా పొరుగు రాష్ట్రం వెళ్తుంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి, ముఖ్యమంత్రికి నిఘా వర్గాల నుండి వీసమెత్తు సమాచారం కూడా ఎందుకు అందలేదు? పై నుండి ఎటువంటి ఆదేశాలు లేకుండానే రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం ఈ తరహా వైఖరి తీసుకుందంటే నమ్మగలమా? పైగా రాష్ట్ర బిజెపి నేతలు, ఆ అంకెలను పేర్లతో సహా ఎలా చెప్పగలిగారు? అస్సోంకు వెళ్ళడానికి విమానం ఎక్కేంతవరకు తిరుగుబాటు ఎంఎల్‌ఏలకు అడుగడుగునా గుజరాత్‌ పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. ఎయిర్‌పోర్టులో కూడా మీడియాతో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఒక్కో ఎంఎల్‌ఏ చుట్టూ నలుగురైదుగురు పోలీసులను మోహరించి విమానం వద్దకు తరలించడంంలో అర్ధమేమిటి? అస్సోంలో దిగగానే అదే స్థాయిలో బందోబస్తు మళ్లీ ఎలా లభించింది? షిండేను వెనుక నుండి నడిపిస్తున్న శక్తి ఏమిటో అర్ధం చేసుకోవడానికి ఈ సంఘటనలు చాలు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి షిండే సిద్ధపడితే చేయూతనిస్తామని బిజెపి ఇప్పటికే ప్రకటించింది. ఇంతగా బరితెగించిన తరువాత గవర్నర్‌ ఎలా వ్యవహరించనున్నారో తెలియనిదెవ్వరికి?
        షిండే శిబిరం నుండి తప్పించుకుని ఠాక్రే గూటికి చేరిన శివసేన ఎంఎల్‌ఏ నితిన్‌ షిండే తనను బలవంతంగా తీసుకెళ్లారని, టెర్రరిస్టు మాదిరి పోలీస్‌ బందోబస్తు మధ్య ఉంచారని చెప్పారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తప్పించుకున్న తనను పోలీసులు వెంటాడి పట్టుకున్నారని, ఒక ఆస్పత్రిలో చేర్చి బలవంతంగా ఇంజెక్షన్‌ ఇప్పించారని, దీంతో కొద్దిసేపు స్పృహ తప్పిపోయానని అన్నారు. స్పృహ వచ్చిన తరువాత అతి కష్టంమీద బయటపడి శివసేన ఆఫీసుకు చేరుకున్నానంటూ ఆయన చెబుతున్న విషయాలు విస్తుగొలుపుతున్నాయి. ఇటువంటి కుయుక్తులతో ఠాక్రేను తప్పించి ప్రస్తుతానికి సి.ఎం కుర్చీని దక్కించుకున్నా షిండే ఆ పదవిలో ఎంతోకాలం కొనసాగడం సందేహాస్పదమే. బిజెపికి చెందిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఎప్పటికైనా తానే ముఖ్యమంత్రి అవుతానని గతంలో చేసిన ప్రకటనే దీనికి కారణం. బిజెపి, సంఫ్‌ుపరివార్‌ పట్ల ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు మరింత అప్రమత్తంగా ఉండి తీరాల్సిన అవసరాన్ని మహారాష్ట్ర సంక్షోభం తెలియచేస్తోంది.