Oct 16,2020 21:28
మిచిగన్‌ గవర్నర్‌ 'నియంత' : నోరు పారేసుకున్న ట్రంప్‌

వాషింగ్టన్‌ : డెమోక్రాట్‌ అయిన మిచిగన్‌ గవర్నర్‌ వైట్‌మర్‌ను 'నియంత'గా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఆమెను కిడ్నాప్‌ చేసి, హతమార్చడానికి ఫాసిస్ట్‌ మిలీషియా పన్నిన కుట్రను సమర్ధించారు. ''మిచిగన్‌లో నియంతలా వుండాలని ఆమె భావించారు. కానీ ప్రజలు ఆమెకు బాసటగా నిలబడలేదు.'' అని ఆయన ఫాక్స్‌ బిజినెస్‌లో పేర్కొన్నారు. ఆమెపై జరిగిన ఈ కుట్రను ఇలా సమర్ధించడం చూస్తుంటే నవంబరు 3న జరిగే ఎన్నికల ఫలితాన్ని పట్టించుకోకుండా అధికారంలో వుండేందుకు మితవాద శక్తులను ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన పరోక్షంగా చేస్తున్న బెదిరింపులతో మితవాద మిలీషియా పోషించే కీలక పాత్ర ప్రముఖంగా తెరపైకి వస్తోంది. గవర్నర్‌పై జరిగిన కుట్రకు సంబంధించి 14వ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మిచిగన్‌ అటార్నీ జనరల్‌ దానా నెసెల్‌ ప్రకటించడంతో ట్రంప్‌ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఆ వ్యక్తిని విస్కాన్సిన్‌కి చెందిన 51ఏళ్ళ బ్రియాన్‌ హిగ్గిన్స్‌గా గుర్తించారు. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా అరెస్టయిన పలువురిని విచారించగా కుట్రకు సంబంధించి కేవలం కొన్ని వివరాలు మాత్రమే వెల్లడయ్యాయని అటార్నీ జనరల్‌ తెలిపారు. పలు రాష్ట్రాలకు చెందిన పలు మిలీషియా గ్రూపులు ఈ కుట్రలో భాగస్వాములుగా వున్నాయని, ఇది కేవలం మిచిగన్‌ గవర్నర్‌ కిడ్నాప్‌కు మాత్రమే పరిమితమైన కుట్ర కాదని, చాలా విస్తృతమైన అంశాలు ఇందులో దాగి వున్నాయని ఎఫ్‌బిఐ ప్రత్యేక ఏజెంట్‌ రిచర్డ్‌ ట్రాస్క్‌ తెలిపారు. కుట్రదారులు చిన్నసైజు సైన్యాన్ని సమీకరించుకున్నారని తెలుస్తోందని చెప్పారు. విస్కాన్సిన్‌ గ్రూపులు మిచిగన్‌లో పోషించిన కీలక పాత్ర, గురువారం హిగ్గిన్స్‌పై మోపిన అభియోగాలు చూస్తుంటే ట్రంప్‌ ప్రభుత్వానికి, కుట్రదారులకు మధ్య సంబంధాలు వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. విస్కాన్సిన్‌ గవర్నర్‌ అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఆంక్షలను నిరసిస్తూ రాష్ట్ర రాజధాని మాడిసన్‌లో ఏప్రిల్‌ 24న జరిగిన 'ఫ్రీడమ్‌ ర్యాలీ' నేపథ్యంలో అక్కడి మితవాద శక్తులు, ట్రంప్‌ ప్రభుత్వానికి మధ్య సంబంధాలు బయటపడ్డాయి.