Dec 05,2021 12:53

సామాజిక మాధ్యమాల్లో సినీ నటులు, వారి కుటుంబాలపై, వ్యక్తిగత విషయాలపై ట్రోలింగ్‌ ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఎంత అభిమానులైతే మాత్రం కనీస జ్ఞానం ఉండాలని కొందరు అంటుంటారు. అయితే ప్రస్తుతం ఈ ట్రోలింగ్‌ హద్దులు దాటిపోతోంది. నటీనటుల శరీరాకృతిపైనా ట్రోలింగ్‌ చేసే స్థాయికి దిగజారిపోయారు కొందరు. సరిగ్గా అలాంటివారికే గట్టి కౌంటర్‌ ఇచ్చారు మలయాళీ నటి సనూష. 'ముందు మీరెంత పర్ఫెక్ట్‌గా ఉన్నారో ఆలోచించుకోండి!' అంటూ అదే సామాజిక మాధ్యమంలో సమాధానమిచ్చారు. అంతేకాదు అనేక సందర్భాల్లో సమాజం తీరును, ఆమెకు ఎదురైన అనుభవాలనూ పంచుకున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!

పేరు : సనూష
ఇతర పేర్లు : బేబీ సనూష,
సనూష సంతోష్‌
పుట్టిన తేదీ : నవంబర్‌ 3, 1994
పుట్టిన ప్రాంతం : కన్నూర్‌, కేరళ
నివాస ప్రాంతం : నీలేశ్వరం, కేరళ
చదువు : బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌
తల్లిదండ్రులు : సంతోష్‌, ఉష
సోదరుడు : సనూప్‌ సంతోష్‌

     బాలనటిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటి సనూష. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'బంగారం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను అందుకున్నారు. మిస్టర్‌ మురుగన్‌ చిత్రంతో తొలిసారిగా హీరోయిన్‌ అవకాశం దక్కింది. ఆ తర్వాత రేణిగుంట, జీనియస్‌ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. హీరో నాని నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్టు పాత్రలో కనిపించి సనూష తన నటనతో మెప్పించారు. ఈ మలయాళీ నటి తెలుగు తెరకు పరిచయం కాకముందే దాదాపు 20 సినిమాల్లో నటించారు. 2000లో వచ్చిన దాదాసాహేబ్‌ సినిమాలో సనూష చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. మలయాళం, తమిళ్‌, కన్నడ, తెలుగు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించారు.
     సనూషా సంతోష్‌ తమ్ముడు కూడా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా మలయాళంలో ఫిలిప్స్‌ అండ్‌ ది మంకీ పెన్‌ చిత్రాల్లో నటించారు. సనూషా ఐదేళ్ల వయసులోనే తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈమె అతి చిన్న వయసులోనే రెండుసార్లు ఉత్తమ బాలనటిగా రెండుసార్లు కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డ్‌ను దక్కించుకున్నారు. మాలయళంలో వచ్చే ఫ్లవర్‌ టీవీలో రెండు ప్రోగ్రామ్స్‌కి మెంటర్‌గా వస్తున్నారు సనూష.
అయితే చిన్పప్పటి నుంచి కాస్తా బొద్దుగా ఉండే సనూష.. ఈ మధ్య ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి నాజూగ్గా మారిపోయారు. ఈ క్రమంలోనే.. ఇటీవల తన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ఇంకేముంది ఆకతాయి నెటిజన్లు ఆమె శరీరాకృతిపై విమర్శలు చేస్తూ.. అసభ్యంగా పోస్టులు పెట్టారు. వీటిని చూసిన సనూష.. నెటిజన్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.
     'నన్ను అనేముందు మీరేంటో తెలుసుకోండి.. మీరేమీ పర్‌ఫెక్ట్‌ కాదు' అంటూ తనపై నెగెటివ్స్‌ కామెంట్స్‌ చేసిన వారికి ఘాటుగా సమాధానం చెప్పారు. 'నా శరీర బరువు గురించి నా కంటే ఎక్కువగా బాధపడుతున్న వారందరికీ నేను చెప్పేది ఒకటే. ఎదుటివాళ్ల వైపు వేలెత్తి చూపిస్తే.. మిగిలిన వేళ్లు మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎదుటివాళ్లను అనేముందు ఒక్కసారి మీరెంత పర్‌ఫెక్ట్‌గా ఉన్నారో ఆలోచించుకోండి!' అంటూ విమర్శకులకు గట్టిగానే ఆన్సర్‌ ఇచ్చారు.
 

లాక్‌డౌన్‌ సమయంలో..
ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సనూష ఆ మధ్య లాక్‌డౌన్‌ సమయంలో ఇంట్లో ఉండలేక నిరాశ, ఒంటరితనాన్ని అనుభవించానని, ఆత్మహత్య చేసుకోవాలనీ అనుకున్నానని, ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకూ తెలియజేయడానికి భయపడ్డానని ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో తెలియజేశారు. అంతేకాదు ఎవ్వరికి తెలియకుండా ఓ మానసిక వైద్య నిపుణుని సాయంతో నార్మల్‌ పర్సన్‌గా మారానని సనూష వెల్లడించారు.

సమాజం మీద నమ్మకం పోయింది..
మలయాళీ నటి సనూష 2018లో ఓ రోజు రాత్రి రైల్లో కన్నూర్‌ నుంచి తిరువనంతపురానికి ప్రయాణిస్తున్నప్పుడు ఒక చేదు అనుభవం ఎదురైంది! ఆ సమయంలో సమాజం మీద నమ్మకం పోయిందని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో తన మీదకు ఎవరో ఒంగినట్లనిపిస్తే చప్పున నిద్ర నుంచి లేచి చూశానని, తీరా చూస్తే ఒకతను తనను ముద్దు పెట్టుకోబోతున్నాడని తెలిపారు. దీంతో అతన్ని గట్టిగా పట్టుకుని, చెయ్యి మెలితిప్పుతూ, లైట్లు వేసి బోగీలోని మిగతా ప్రయాణికుల్ని అలర్ట్‌ చేశానని, 'ప్లీజ్‌.. దీన్ని ఇష్యూ చెయ్యకండి!' అని అతను బతిమాలుతున్నాడని, ఇదంతా గమనిస్తూ.. బోగీలో ఒక్కరూ సపోర్టుగా రాలేదని, అతడినీ ఏమీ అనకుండా.. చోద్యం చూస్తున్నట్లు ఉండిపోయారని.. ఆ ఘటన గురించి చెప్పారు. తనతోపాటు ప్రయాణిస్తున్న రైటర్‌ ఉన్ని, రంజిత్‌, ఇంకొకతను మాత్రం అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 'ఇదే విషయాన్ని ఫేస్‌బుక్‌లో పెట్టి ఉంటే 'ఐయామ్‌ విత్‌ సనూష' అని కామెంట్లు పెట్టేవాళ్లు. వాళ్ల డిస్‌ప్లే పిక్‌లనూ నాకు మద్దతుగా మార్చుకునేవారు. కానీ ఇదంతా సోషల్‌ మీడియా వరకేనా? నిజజీవితంలో ఎవరూ బాధితులకు అండగా నిలబడే ధైర్యం చేయలేరా?' అని సనూష అన్నారు. అంతేకాదు, 'ఆ రాత్రి జరిగిన ఘటన ఈ సమాజంపైన తనకు నమ్మకాన్ని పోగొట్టింది' అని ఆవేదన చెందారు.