
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు మిర్చి యార్డులో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటీవల అకాల వర్షాలతో తడిసిన మిర్చి యార్డుకు వస్తుందని, నాణ్యత తగ్గిందని, తేమ శాతం ఎక్కువగా ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, ఎన్‌టిఆర్ జిల్లాల నుంచి సరుకు వస్తుంది. వాస్తవంగా వర్షాల వల్ల ఇబ్బందులు వచ్చినా రైతులు చాలా వరకు జాగ్రత్తలు పాటించి మిర్చి తడవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కొన్నిచోట్ల టార్ఫాలిన్ పట్టాలు ఏర్పాటు చేసినా అధికవర్షాలు కురిసిన ప్రదేశాల్లో కల్లాల్లో మిర్చి తడిసింది. మిర్చిపైరుపైన ఉన్న కాయలు తడిసిపోవడం వల్ల నాణ్యత దెబ్బతిందని చెబుతున్నారు.
మిర్చికి మంచి రేటు వుందని భావించి అధికంగా పెట్టుబడిపెట్టిన రైతులకు అకాల వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలోని ప్రత్తిపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, తాడికొండ, గురజాల, వినుకొండ, మాచర్ల తదితర ప్రాంతాల్లో అకాల వర్షాల దాటికి మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. పూర్తిస్థాయిలో అప్పుడే వర్షాలకు దెబ్బతిన్న సరుకు రాకపోయినా వ్యాపారులు ముందుగానే సిండికేటై ధరలను తగ్గిస్తున్నారనే విమర్శలున్నాయి. అకాల వర్షాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. నిత్యం ఎదో ఒక ప్రాంతంలో ఒక మోస్తరు నుంచిభారీ వర్షం కురుస్తోంది. దీంతో మిర్చి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
సోమవారం గుంటూరు యార్డుకు 92,254 టిక్కీలు రాగా పాతనిల్వలతో కలిపి 89,659 టిక్కీలు అమ్ముడుపోయాయి. ఇంకా 82,011 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గత వారం కంటే కొన్ని వెరైటీలకు ధరలు తగ్గగా మరికొన్ని వెరైటీల ధరలు నిలకడగా ఉన్నాయి. 334 రకం కనిష్ట ధర క్వింటాళ్ రూ.9 వేలు, గరిష్ట ధర రూ.24 వేలు, నెంబరు 5 రకం కనిష్ట ధర రూ.11,500, గరిష్టం రూ.23,500 ధర కాగా, 273 రకం కనిష్టం రూ.10,500, గరిష్టం రూ.22 వేలు, 341 రకం కనిష్టం రూ.10 వేలు, గరిష్టం రూ.24,500, 4884 రకం కనిష్టం రూ.10 వేలు, గరిష్టం రూ.20,500, సూపర్ 10 రకం కనిష్టం రూ.18 వేలు, గరిష్టం రూ.22 వేలు ధరలు లభించాయని యార్డు అధికారులు వెల్లడించారు. మేలు రకాలైన తేజ క్వింటాళ్ కనిష్టం రూ.9 వేలు, గరిష్టం రూ.24 వేలు, బాడిగ రకం కనిష్టం రూ.11,500, గరిష్టం రూ.27 వేలు, దేవనూరు డీలక్సు కనిష్టం రూ.13 వేలు, గరిష్టం రూ.23,500 లభించాయి. గత వారంలో కంటే పలు వెరయిటీల్లో క్వింటాలుకు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు తగ్గాయి. ఈ ధరలు మరింత తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. కారం కోసం వినియోగించే మిర్చి డ్రై అయి ఉండాలని, నాణ్యతగా ఉండాలని అంటున్నారు.