Feb 06,2023 21:25

రైతులకు సూచనలు చేస్తున్న ఎఒ తిరుపతిరావు

ప్రజాశక్తి- పాచిపెంట : మొక్కజొన్న పంట ఎక్కువగా ఎరువులు గ్రహించే పంట అని ప్రతి సీజన్‌లో అదే పంటను పండించడం వల్ల భూమి నిస్సారం అవుతుందని ఎఒ కొల్లి తిరుపతిరావు అన్నారు. పాంచాలి ఆర్‌బికెలో రైతులతో సోమవారం సమావేశమయ్యారు. రైతులు పంట మార్పిడి విధానాలను అవలంబిస్తూ మిశ్రమ, బహుళ పంటలను పండించాలని అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని అన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను ఈక్రాప్‌లో నమోదు చేసుకుని ఇకెవైసి చేయించుకోవాలని అన్నారు. పాంచాలి పరిధిలో ఎక్కువగా మొక్కజొన్న, పత్తి పంటలు సాగులో ఉంటాయని పత్తి వరుసల మధ్యలో అపరాలు లేదా చిరుధాన్యాలు వేసుకోవాలని, భూమి ఎక్కువగా సూర్యుని వేడికి లోను కాకూడదని సూచించారు. వీలైనంత వరకు 365 రోజులు ఏదో ఒక పంటతో భూమి కప్పి ఉంచినప్పుడే భూమిలో సేంద్రీయ కర్భనం వృద్ధి చెంది భూమి సారవంతమవుతుందని చెప్పారు. అనేక రకాలైన బ్యాక్టీరియా, వానపాములు వృద్ధి చెందాలంటే భూమి లోపల పొరలు చల్లగా ఉండాలన్నారు. వరి పంటకు నీరు అధికంగా అవసరమని ఒక ఎకరా వరి పంటకు కావలసిన నీటితో సుమారు మూడు ఎకరాల అపరాలు లేదా చిరుధాన్యాలు పండించవచ్చని ఖర్చు కూడా బాగా తగ్గి అధిక ఆదాయం పొందవచ్చుని తెలిపారు. రైతులు సాగులో ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక మెలకువలను తెలుసుకొని ఖర్చులు తగ్గించుకుని లాభదాయకమైన వ్యవసాయాన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదుబిల్లి శ్రీను రైతులు పాల్గొన్నారు.