
కౌలాలంపూర్ : కరోనా కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు మలేసియా రాజు సుల్తాన్ అబ్దుల్లా అహ్మద్ షా మంగళవారం ప్రకటించారు. ఆగస్టు 1 వరకు ఈ అత్యవసర పరిస్థితి అమల్లో వుంటుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ప్రధాని ముహియుద్దీన్ యాసిన్ అభ్యర్ధన మేరకు సుల్తాన్ అబ్ధుల్లా ఈ ప్రకటన చేసినట్లు రాజభవనం ఒక ప్రకటనలో పేర్కొంది. కేసులు తగ్గితే అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తామని తెలిపింది. అయితే దేశంలోని అస్థిర ప్రభుత్వం అధికారాన్ని పట్టుకొని వేలాడేందుకు కరోనాను సాకుగా వినియోగించుకుంటోందని విమర్శకులు పేర్కొంటున్నారు. 10 మాసాల ముహియుద్దీన్ ప్రభుత్వం పలు సవాళ్ళను ఎదుర్కొంటూ అత్యంత అస్థిరంగా వున్న సమయంలో ఈ చర్య పార్లమెంట్ సమావేశాల రద్దు చేయడంతో పాటు స్థానిక ఎన్నికల నుంచి తప్పించుకునేందుకు సహకరిస్తుందని విమర్శించారు.