Nov 21,2020 20:58

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరోనా విజృంభిస్తుండటంతో రాజధానులు, నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూలు కానీ, 144 సెక్షన్లు కానీ విధించాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. ఢిల్లీలో మాస్క్‌లు ధరించకుంటే రూ.2,000 జరిమానా విధించనున్నారు. పెళ్లిళ్లకు 50 మంది అతిథులనే అనుమతిస్తున్నారు. ముంబైలో డిసెంబర్‌ 31 వరకూ స్కూళ్లు మూసే ఉంచుతున్నారు. ముంబయి సిటీలో లోకల్‌ రైళ్ల ఆపరేషన్‌ ఇంకా ప్రారంభించడం లేదని మేయర్‌ ప్రకటించారు. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకూ తిరిగి పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నారు. పాలు, మందుల దుకాణాలనే అనుమతిస్తున్నారు. రాజ్‌కోట్‌, సూరత్‌, వడోదర్‌లో రాత్రి కర్ఫ్యూ విధించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌, భోపాల్‌, గ్వాలియర్‌, రత్లామ్‌, విదిశలో శనివారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. అంతరాష్ట్ర, అంతర్‌ జిల్లా వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ 1 నుంచి 8వ తరగతి వరకూ స్కూళ్లు మూసే ఉంటాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాఠశాలలు, కాలేజీలకు హాజరవుతారని అధికారులు తెలిపారు. సినిమా హాళ్లు 50 శాతం సామర్థ్యంలోనే నడుస్తాయి. రాజస్థాన్‌లోని అన్ని జిల్లాల్లో ఈ నెల 21 నుంచి సెక్షన్‌ 144 అమల్లోకి వస్తోంది. హర్యానా, మణిపూర్‌లో కూడా స్కూల్స్‌ పున:ప్రారంభ ఆదేశాలు నిలిపేశారు.
పెరుగుతున్న కేసులు
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 90.50 లక్షలకు, మరణాల సంఖ్య 1.32 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 46,232 పాజిటివ్‌ కేసులు, 564 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 90,50,597కు, మృతులు 1,32,726కు చేరాయి. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,39,747 యాక్టివ్‌ కేసులున్నాయి. గత 24 గంటల్లో 49,715 మంది, మొత్తంగా 84,78,124 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 93.67 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.47 శాతానికి తగ్గింది. యాక్టివ్‌ కేసులు 4.86 శాతంగా ఉన్నాయి. గత 24 గంటల్లో 10,66,022 శాంపిల్స్‌కు, మొత్తంగా 13,06,57,808 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసిఎంఆర్‌ తెలిపింది.