
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 14,199 మంది వైరస్ బారిన పడ్డారు. వారం రోజుల క్రితం ఫిబ్రవరి 16న నమోదైన కేసులు 9,121 మాత్రమే! అంటే ఏడురోజుల్లో సగటున 13.8 శాతం కేసులు పెరిగాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రోజువారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో కొవిడ్ నిబంధనలను సక్రమంగా, తప్పనిసరిగా పాటించాలని ఆ రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కొత్త వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ముందు జాగ్రత్తలు తప్పనిసరని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా వుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెప్పారు. కేసులు పెరిగితే మళ్లీ లాక్డౌన్ తప్పదని హెచ్చరించారు. కరోనా కాస్త తగ్గిందని అనుకోగానే ప్రజలు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోవడం మానేశారని, అందువల్లే పరిస్థితి మళ్లీ తీవ్రమవుతోందని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్త వైరస్ వేరియంట్లు 240 వరకు తలెత్తాయని మహారాష్ట్ర కొవిడ్ టాస్క్ఫోర్స్ సభ్యుడు శశాంక్ జోషి చెప్పారు. కేసులు పెరగడానికి కొత్త వైరస్లు కూడా ఒక కారణమని అన్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, కొత్త కేసుల సంఖ్య చూస్తుంటే మళ్ళీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్యానించారు. మళ్లీ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ వంటి చర్యలను ముమ్మరం చేయాల్సి వుందన్నారు. భారత్లో గత నెల వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దాదాపు కోటీ 7లక్షలమంది ఒక్క డోసైనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మొదటి దశలో మూడు కోట్ల మందికి వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం.