Jul 22,2021 00:52

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి, చింతపల్లి
విశాఖ మన్యంలో మళ్లీ తుపాకులు పేలాయి. ప్రశాంతంగావున్న ఏజెన్సీలో మళ్లీ అలజడి రేగింది. ఎటువైపు నుంచి ఏ విధమైన ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం గిరిజనుల్లో పెరిగింది. జికె.వీధి మండలం, అమ్మవారిధారకొండ పంచాయతీ, పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎవరూ గాయపడలేదు. మావోయిస్టులు కాల్పుల ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. వీరంతా జూన్‌ 16న తీగలమెట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కొయ్యూరు మండలం తీగలమెట్ట వద్ద జూన్‌ 16న పోలీసు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. తీగలమెట్ట ఘటనలో గాయపడిన మావోయిస్టులు తప్పించుకొని పరిసర ప్రాంతాల్లో తలదాచుకొనివుంటారని భావించిన పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేశారు. ఈ కాల్పుల్లో గాయపడి తప్పించుకున్న వారిలో విశాఖ తూర్పు డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ, ఉదరు వుంటారన్న సమాచారంతో భారీ బలగాలతో అటవీ ప్రాంతంలో గాలించారు. అప్పటి నుంచి ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో తీగలమెట్ట ఘటన జరిగిన 35 రోజులకు సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని పెద్దంపల్లిలో ఎదురుకాల్పులు జరిగాయి. పెదబయలు, కోరుకోండ డివిజనల్‌ కమిటీ సభ్యునిగా పనిచేసి కొద్ది రోజుల క్రితం మావోయిస్టు పార్టీ నుంచి బయటకొచ్చిన చిక్కుడు చిన్నారావు అలియాస్‌ సుధీర్‌ ఇచ్చిన సమాచారం పోలీసులకు తోడ్పడినట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో కీలకంగావున్న అరుణ, ఉదరు ఈ ఎదురుకాల్పుల్లో వుంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో గాలింపు చర్యలు పెంచారు. ఈ నెల 28 నుంచి వారోత్సవాలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. తీగలమెట్ట ఘటనకు ప్రతీకారంగా మావోయిస్టులు ఏజెన్సీలో ఎక్కడైనా దాడులకు దిగే అవకాశముందని పోలీసులకు సమాచారం వుండడంతో భారీ బలగాలతో పోలీసులు కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు. పోలీసు, మావోయిస్టు చర్యలు గిరిజనులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.