Jun 11,2021 21:21

ఢాకా: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రిమియర్‌ లీగ్‌(డిపిఎల్‌)లో ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఉల్‌ హసన్‌ మరోసారి సహనాన్ని కోల్పోయాడు. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ఫీల్డ్‌ అంపైర్‌తో గొడవకు దిగాడు. వాగ్వాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో క్రీడాభిమానులు తీవ్రస్థాయిలో షకీబ్‌ను విమర్శిస్తున్నారు. మహ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌కు షకీబ్‌ కెప్టెన్‌గా ఉన్న షకీబ్‌ శుక్రవారం అబహాని లిమిటెడ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఎల్బీడబ్ల్యు కోసం అంపైర్‌కు అప్పీల్‌ చేయగా నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఆవేశానికి గురైన షకీబ్‌ వికెట్లను కాళ్లతోతన్నాడు. ఆ తర్వాత ఆరో ఓవర్లో మళ్లీ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆరో ఓవర్లో ఒక బంతి మిగిలుండగా వర్షం రావడంతో అంపైర్‌ మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశాడు. అంపైర్‌ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన షకీబ్‌.. ఈసారి నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ పెకళించి భూమికేసి బలంగా కొట్టాడు. ప్రస్తుతం రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న షకీబ్‌ క్షమాపణలు చెబుతూ సోషల్‌మీడియాలో ఓ సందేశాన్ని విడుదల చేశాడు.

మళ్లీ సహనం కోల్పోయిన షకీబ్‌