
మల్లు స్వరాజ్యం ఆశయాల కోసం పని చేయాలి
ప్రజాశక్తి-అనంతసాగరం : తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమ నాయకులు మల్లు స్వరాజ్యం ఆశయాల సాధనకు ప్రజలందరూ పనిచేయాలని సిపిఎం మండల కార్యదర్శి అన్వర్‌బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం సిపిఎం, ప్రజాసంఘాల అధ్వర్యంలో మల్లు స్వరాజ్యం ప్రధమ వర్థతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పేద ప్రజల కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం తెలంగాణా సాయుధ పోరాటాన్ని నడిపిన ధీర వనిత మల్లు స్వరాజ్యం అని తెలియజేశారు. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మండలంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో కనీస వసతులు కల్పించాలని గురువారం ఎంపిడిఒ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో స్థలాలు మంజూరైన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలునిచ్చారు. జెవివి నాయకులు వేము పెంచలయ్య మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం సారా వ్యతిరేక పోరాటం నడిపారని, అలాగే 1978 నుండి 1983 వరకు తుంగతుర్తికి ఎంఎల్‌ఎగా పని చేశారన్నారు. ఆమె ఆశయ సాధన కోసం పేదప్రజల సమస్యలపై ప్రజాపోరాటలు నిర్మించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు రాటకొండ పెంచల నాయుడు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.