Feb 06,2023 21:35

సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ

సీతంపేట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందని, గిరిజన ఓట్లుతో గెలిచిన ప్రభుత్వం, ఎమ్మెల్యే హామీలను నెరవేర్చలేదని పాలకొండ నియోజకవర్గ టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి నిమ్మక జయకృష్ణ ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పునాదులు కూడా దాటలేదన్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీ పనులు కూడా పునాదులకే పరిమితమయ్యావని అన్నారు. వెంటనే ఈ పనులను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఐటిడిఎలో తూతూ మంత్రంగా ఒక పాలకవర్గ సమావేశం జరిగిందని, గిరిజనుల సమస్యలు పరిష్కరించాల్సిన పాలక వర్గాలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఐటిడిఎలో నిధుల్లేక నిర్వీర్యంగా మారిందన్నారు. వేసవి వచ్చినప్పటికీ తాగునీటి సమస్య వెంటాడుతుందన్నారు. ఫీడర్‌ అంబులెన్స్‌లు మూలన పడి ఉన్నాయని గిరిజనులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఏనుగులు వల్ల ఇప్పటికే ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందని, కనీసం పట్టించుకునే నాధుడు కరువయ్యారని విమర్శించారు. జగత్‌ పల్లి రిసార్ట్స్‌ గిరిజన మ్యూజియం పనులు ప్రారంభించాలని అన్నారు. జీవో నెంబర్‌ 3కు ప్రభుత్వమే పిటిషన్‌ వేసి పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు సవరతోట మొఖలింగం, బిడ్డిక దమయంతి నాయుడు, రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి బిడ్డిక చందర్రావు, సర్పంచ్‌ అప్పారావు, సుబ్బారావు మొండంగి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.