
మలీషా మురికివాడలో పుట్టి పెరిగింది. కానీ, ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల తననొక విజేతగా నిలిపాయి. బాలీవుడ్ తారలు సైతం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లుగా మారారు. ఆశ్చర్యంగా ఉంది కదూ! 14 ఏళ్ల వయసుకే సోషల్ మీడియాలో 60 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అదే ఆమెను 'స్లమ్ ప్రిన్సెస్ ఆఫ్ ఇండియా' చేసింది.
రోడ్ల వెంట తిరుగుతూ కాగితాలు, ప్లాస్టిక్ వస్తువులు ఏరి, విక్రయించగా వచ్చిన డబ్బుతో మలీషా కుటుంబం జీవిస్తోంది. ఆమె ముంబైలోని బాంద్రాలో ఒక మురికివాడలో తన కుటుంబంతో నివసిస్తోంది. బతుకుదెరువు కోసం గుజరాత్ నుంచి ముంబైకు వలస వచ్చారు ఆమె తల్లిదండ్రులు. కర్రలతో, పరదా పట్టాలతో ఇల్లు నిర్మించుకున్నారు. పెద్ద వర్షం వస్తే ఇల్లంతా కురుస్తుంది. గాలి వస్తే కూలిపోతుంది. మరుసటిరోజు తిరిగి నిర్మించుకుంటారు. నిత్యం దోమలతో నిద్ర ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మలీషా స్కూలుకు వెళ్లి చదువుకుంటోంది. బాగా చదువుకుంటూనే భవిష్యత్తు అని పదేళ్ల వయస్సులోనే అర్థం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియం తరగతుల్లో చేరింది. ఇంగ్లీషులో మాట్లాడ్డంపై పట్టు సాధించింది. పేపర్లలో హీరోయిన్లు అందమైన డ్రస్‌లతో కనిపించడం చూసి తానూ మోడలింగ్ రంగంలో రాణించాలనుకునేది. సూపర్ మోడల్‌గా పేరు తెచ్చుకోవాలని, డ్యాన్సు నేర్చుకోవాలని అనుకొంది. మోడలింగ్ రంగంలో మెలకువలు తానే స్వంతంగా నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న బట్టలను రకరకాల మోడల్స్‌లో వేసుకుంటూ, కొత్తదనం సృష్టించేది. అద్దం ముందు నిలబడి మోడల్‌గా ఫీలవుతూ మురిసిపోయేది.
- నటుడు రాబర్ట్ హాఫ్మన్ ద్వారా ...
అవకాశం అందరికీ రాదు. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మలీషా ఖర్వా వెనకాడలేదు. తనను తాను నిరూపించుకుంటూ తోటి పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. కరోనా సమయంలో హాలీవుడ్ నటుడు రాబర్టు హోల్స్మన్ దేశానికి వచ్చారు. లాక్డౌన్ విధించడంతో ముంబైలోనే ఉండిపోయారు. తాను తీస్తున్న షార్ట్ ఫీలింకు ఓ బాలిక కోసం స్లమ్ ఏరియాలో తిరిగారు. అప్పుడే మలీషా కనిపించింది. భుజం మీద నీళ్ల డబ్బు పెట్టుకుని మోసుకు వెళుతుంది. ఆమెను పలకరించగా ఇంగ్లీషులో తిరిగి సమాధానం ఇచ్చింది. ఆ వయసులో మలీషాలో ఆత్మవిశ్వాసం ఆయన్ను ఆశ్చర్యపరిచింది. తమ సినిమాకు ఆమెను ఎంపిక చేసుకున్నారు. 'జాస్ సాగు' 'అర్సాలా ఖురేషీల లైవ్ యువర్ ఫెయిరీటేల్' అనే షార్ట్ ఫిల్మ్ ముఖ్య పాత్రలో మలీషా నటించింది. చిత్రీకరణ సమయంలో మలీషా ఖర్వా గురించి మరిన్ని విషయాలు రాబర్టు తెలుసుకున్నారు. ఆమె మొఖంలో ఎప్పుడూ మెరిసిపోతూ ఉండే నవ్వు చూసి 'ప్రిన్సెస్ ఫ్రెమ్ ది స్లమ్' అని పేర్కొన్నారు. అదే పేరుతో ఇన్స్టాగ్రామ్ ప్రారంభించి ఇచ్చారు. దాంట్లో ఆమె ఫొటోస్, దినచర్య విషయాలను పోస్టు చేస్తూ ఉండేది. మలీషా ఖర్వాను ప్రోత్సహించాలంటూ రాబర్టు పోస్టు చేశారు. దాంతో ఎంతోమంది సెలబ్రెటీలు ఆమెకు విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలిచారు. మలీషా స్నేహితుల సాయంతో కొన్ని వీడియోలు చేసి పోస్టు చేసింది. మురికివాడలో ఉండే ప్రజల జీవితాలను, దీనగాధలను వెబ్సీరిస్లుగా యూట్యూబ్‌లో పెట్టింది. ఆమె నటన, ప్రతిభా చూసి చాలామంది నటీనటులు ఆమెకు ఫాలోవర్స్‌గా మారారు. వారిలో బాలీవుడ్ తారలు దీయామీర్జా, అతిథి రావు, తదితర సినీ ప్రముఖులూ ఉన్నారు. ప్రముఖ ఫొటో ఫ్యాషన్ మ్యాగజైన్లో ఆమె ఫొటో పబ్లిష్ అవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అమెజాన్ కంపెనీ మలీషాకు ఓ ల్యాప్‌ట్యాప్ బహుమతిగా ఇచ్చింది. దానిద్వారా మలీషా ఆన్లైన్ క్లాసులు వింటోంది.
ఇంత పేరు సంపాదించుకున్న మలీషా రోజులో మూడు పూటలా అన్నం తినడం కష్టం. తండ్రికి ఒక్కోరోజు సరైన పని దొరకదు. దాంతో వారంతా ఖాళీ కడుపుతోనే పడుకున్న రోజులు చాలానే ఉన్నాయి. తల్లిదండ్రులు పనికోసం బయటకు వెళితే... తమ్ముడికి తానే అమ్మ అవుతుంది. రెడీ చేసి తన వెంట స్కూలుకు తీసుకెళుతుంది. చైల్డ్ మోడల్‌గా ఉన్న మలీషా ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతోంది. సాయంత్రం వేళల్లో తన వీధి పిల్లలకు చదువు చెబుతోంది.
