Sep 25,2021 10:25

న్యూఢిల్లీ : ప్రపంచ వేదికలపై తమను ఎగతాళి చేసేముందు.. పాకిస్తాన్‌ ఓ సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని భారత్‌ సూచించింది. ఐక్యరాజ్యసమితి నిషేధించిన అనేక మంది ఉగ్రవాదులకు పాక్‌ ఆతిధ్యమిచ్చి హేయమైన రికార్డును కలిగి ఉందని తెలిపింది. జమ్ముకాశ్మీర్‌ అంశంపై ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాక్‌ ప్రస్తావించడంపై భారత్‌ ఎదురు దాడి చేసింది. జమ్ముకాశ్మీర్‌, లఢఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలు.. దేశంలో అంతర్భాగమని, వీటిని విడదీయలేమని భారత్‌ పునరుద్ఘాటించింది. యుఎన్‌ జనరల్‌ సమావేశంలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చిన భారత్‌.... పాక్‌ ఉగ్రవాదులకు సాయం చేయడం, ఆశ్రయం కల్పించడం, మద్దతునిచ్చే చరిత్ర కలిగి ఉందని పేర్కొంది. 'ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిషేధించిన అనేక మంది ఉగ్రవాదులకు పాక్‌ ఆతిధ్యమిచ్చి.. నీచమైన రికార్డును మూటగట్టుకుంది. ఒసామా బిన్‌లాడెన్‌ పాక్‌లో ఆశ్రయం పొందారు. ఈనాటికి కూడా బిన్‌లాడెన్‌ను అమరవీరుడిగా దాయాది దేశం కీర్తిస్తుంది' అని సర్వసభ్య సమావేశంలో తొలి కార్యదర్శి స్నేహ దూబే అన్నారు. పాక్‌ ఒక అగ్ని అని, కానీ మారువేషంలో ఫైర్‌ ఫైటర్‌నని చెప్పుకుంటుందని అన్నారు. తన పెరట్లో ఉగ్రవాదులు పెంచిపోషిస్తోందని, ఆ దేశ విధానాల వల్ల ప్రపంచం మొత్తం బాధపుడుతుందని స్నేహ వ్యాఖ్యానించారు.
తమ దేశంపై అభాండాలు వేసేందుకు యుఎన్‌ ఇచ్చిన వేదికను పాక్‌ ప్రధాని దుర్వినియోగపర్చుకోవడం ఇదేమీ కొత్తేమి కాదని, ఇది విచారకమని అన్నారు. సాధారణ ప్రజలు, ముఖ్యంగా మైనార్టీలకు చెందిన వారి జీవితాలు తలక్రిందులు అవుతుండగా, ఉగ్రవాదులకు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తూ, అక్కడి పరిస్థితుల నుండి ప్రపంచం దృష్టిని మరల్చాలన్న ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం, సాయం అందించడం పట్ల సభ్య దేశాలకు తెలుసునని పేర్కొన్నారు. పాక్‌ ఉగ్రవాదులకు బహిర్గతంగా మద్దతున్విడం, శిక్షణ, ఆర్థిక సాయం చేస్తుందని ప్రపంచం గుర్తించిందని అన్నారు. పాక్‌లా కాకుండా భారత్‌లో స్వేచ్ఛాయుత మీడియా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉందని, అవే తమ రాజ్యాంగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నారు. బహుళ్వ వాదమనే అంశాన్ని పాక్‌ అర్థం చేసుకోవడం కష్టమని అన్నారు.