May 09,2021 23:28

గుంటూరు జిజిహెచ్‌ కోవిడ్‌ ఓపీలో రద్దీ

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోజుకు సగటున 1500 నుంచి 2 వేలమందికి పైగా వైరస్‌ బారిన పడుతున్నట్లు నిర్ధారణవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 17,764 క్రియాశీలక కేసులున్నాయి. వీరిలో సగం మంది హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మిగతా వారు పడకల కోసం ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రుల వారు ఏజెంట్లను ఏర్పాటు పెట్టి ప్యాకేజీలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్యాకేజీలు చెల్లించినా మరణాలు సంభవిస్తుండగా సొమ్ము చెల్లింపుల విషయంలో ఘర్షణలు చెలరేగేతున్నాయి. ఆర్‌టిపిసిఆర్‌, యాంటిజెన్‌, ట్రూనాట్‌ పరీక్షల ద్వారా ప్రభుత్వం కరోనా నిర్ధారిస్తోంది. అయితే ప్రయివేటు ఆస్పత్రుల్లో సిటీస్కాన్‌, చెస్టు ఎక్స్‌రే ద్వారా కూడా కరోనా నిర్ధారణ జరుగుతోంది.
మరోవైపు కొన్ని ప్రాంతాలో ర్యాపిడ్‌ పరీక్షలు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇవి ప్రభుత్వ గణాంకాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీని వల్ల ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉన్న యాక్టివ్‌ కేసులకు, ఆస్పత్రులకు పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులకు మధ్య వ్యత్యాసం ఉంటోంది. వివిధ ప్రాంతాల్లో చేసే ర్యాపిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారు నేరుగా ఆస్పత్రులకు రావడం, వారి వివరాలు ప్రభుత్వం వద్ద లేకపోవడంతో 104లో నమోదు చేసుకున్నా బెడ్‌ కేటాయించలేక పోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాపిడ్‌ పరీక్షలు, సిటీ స్కాన్‌ ద్వారా జరిగే పరీక్షల ద్వారా ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా చేరుతున్నారు. దీంతో ప్రభుత్వానికి వస్తున్న నివేదికలకు, ఆస్పత్రుల్లో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండటంలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో లక్షణాలు తక్కువగా ఉన్న వారిని ఐదు నుంచి ఏడు రోజుల్లో డిశ్చార్జి చేస్తున్నారు. అయితే వీరు తిరిగి ఇంటికి వెళ్లిన తరువాత మళ్లీ ఊపరి తీసుకోవడం, ఇతర సమస్యలు వస్తే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం కరోనా చికిత్సకు అనుమతించిన లెక్కల్లో పడకలు ఖాళీగా ఉన్నట్టు చూపుతున్నా వాస్తవంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో ఎక్కడికి వెళ్లినా రోగులకు ఖాళీలు లేవనే సమాధానం వస్తుంది. ర్యాపిడ్‌, సిటీ స్కాన్‌ ద్వారా నిర్ధారించిన రోగులు వీటిల్లో ఎక్కువగా చేర్చుకోవడం వల్ల ఆయా ఆస్పత్రుల్లో ఖాళీలు ఉండటం లేదు. మరో వైపు కరోనా వచ్చిన తరువాత చికిత్స పొందుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. మృతికి మాత్రం అధికారులు వేర్వేరు కారణాలు చూపతున్నారు. కరోనా చికిత్స పొందుతూనే గుండెపోటు వల్ల ఎక్కువ మంది మృతి చెందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
గుంటూరు, తెనాలి, నర్సరావుపేట తదితర ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు ఖాళీ లేవు.104కి ఫోన్‌ చేసినా మూడు గంటల్లో బెడ్‌ కేటాయించే పరిస్థితి లేదు. 104 ఫోన్‌ చేసిన తరువాత కనీసం 10 గంటలకు బెడ్‌ దొరకడం కష్టంగా మారుతుంది. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన తరువాత కూడా 10 నుంచి 12 గంటలు వేచి ఉంటే తప్ప పడక దొరకని పరిస్థితి నెలకొంది. రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపిల సిఫార్సు ద్వారా కరోనా నిర్ధారణ కాగానే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారు. సామాన్యులకు ఇక్కడ బెడ్‌ దొరకకపోయినా రాజకీయ సిఫార్సు కలిగిన వారికి మాత్రం బెడ్‌ గంటల వ్యవధిలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సామాన్యులకు పడకలు ఖాళీ లేవని సమాధానం వస్తుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే స్థోమత లేక ప్రయివేటు ఆస్పత్రుల్లో పడక దొరక్క నిర్జీవంగా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఇలాంటి వారే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నారు.