May 17,2022 09:42
  • 'మీ ఫ్రెండ్‌ను చూడండి. ఎంత చక్కగా ఉంటాడో... మంచి క్రమశిక్షణలో పెరిగిన పిల్లలు అలాగే ఉంటారు. మీరూ ఉన్నారు చూడండి.. ఎప్పుడూ మాటకు ఎదురుచెప్పడం, అల్లరిచిల్లరగా తిరగడం' అంటూ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను మందలిస్తూ ఉంటారు. అసలు క్రమశిక్షణలో మంచి, చెడు ఉంటాయా? చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలపై గట్టిగా అరవడమో... వారు చేస్తున్న పనిని నియంత్రించడమో చేస్తూ అదే క్రమశిక్షణ అనుకుని అపోహపడతారు.కాని పిల్లలపై ఆ విధమైన చర్యలు ఎప్పటికీ మంచి ఫలితాలు ఇవ్వవు.


పిల్లల్లో సానుకూల సంబంధాలను ఏర్పరచడంలో, బాధ్యత, సహకారం, స్వీయ క్రమశిక్షణ వంటి నైపుణ్యాలు అలవర్చడంలో సానుకూల క్రమశిక్షణ ఎలా తోడ్పడుతోందో అనేదానిపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ లూసీ క్లూవర్‌ ఈవిధంగా స్పందించారు. 'చెడ్డ పిల్లలు ఉండరు... చెడ్డ ప్రవర్తనే ఉంటుంది...' అని ఆమె పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తరచూ తమ ఒత్తిడిని పిల్లలపై చూపిస్తుంటారు. భౌతికంగా వారిని హింసించడమో, గట్టిగా అరవడమో చేస్తుంటారు. ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నిస్తే మా ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వేరే మార్గం లేదని కూడా సమాధానమిస్తారు. కాని అదేపనిగా పిల్లలపై అరవడం, కొట్టడం చేస్తుంటే దీర్ఘకాలంలో అది చెడు పరిణామాలకు దారితీస్తుంది. పిల్లల జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా మారుతుందంటే బడికి వెళ్లనని పేచీపెట్టడం, నిరాశగా ఉండడం, మాదకద్రవ్యాల వినియోగం, ఆత్మహత్య, గుండెజబ్బులు వంటి విపరీతాలు పిల్లల్లో సంభవిస్తాయి.
పిల్లల్లో సానుకూల స్వాభావం అలవర్చాలంటే చేయాల్సిందల్లా తల్లిదండ్రులుగా మీరు వారి దృష్టికోణంలో ఆలోచించడం నేర్చుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం పిల్లలతో గడపడం అలవర్చుకోండి. భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగస్తులై పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నామని చాలామంది అంటుంటారు. ఎన్ని పని ఒత్తిళ్లు ఉన్నా పిల్లల కోసం తగినంత సమయం కేటాయించాల్సిందే అంటారు నిపుణులు. మీ టీవీలను కట్టేయండి. ఫోన్లను స్విచ్ఛాప్‌ చేయండి. అప్పుడు పిల్లల్తో గడపడానికి మీకు బోలెడంత సమయం ఉంటుంది.

మంచి క్రమశిక్షణ అంటే..?
ఏదైనా మంచి అలవాటును పిల్లలకు నేర్పించడం ఎలా అని చాలామంది సతమతమైపోతుంటారు. అయితే ఆ అలవాటు రోజుకు 20 నిమిషాలు కావొచ్చు. ఐదు నిమిషాలే కావొచ్చు. ముందు మీరు చేస్తున్న పనిలో వారిని భాగస్వాములను చేయండి. మీరు పాట పాడుతున్నప్పుడు మీతో కలసి గొంతు కలపనివ్వండి. పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడో... బట్టలు ఉతుకుతున్నప్పుడో వారు చేయదగిన పనులు పిల్లలకు అప్పజెప్పండి.
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. అప్పుడే మంచి, చెడుల గురించి విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. ఆ చర్చ వారిని చెడు ప్రవర్తన వైపు వెళ్లకుండా చేస్తుంది. పిల్లలెప్పుడూ తల్లిదండ్రుల నుంచి ప్రేమ, మద్దతు కోరుకుంటుంటారు. అందుకే వారు ఏ మంచి పని చేసినా ప్రశంసించడం మర్చిపోవద్దు. చివరికి తోబుట్టువుతో కాసేపు ఆడుకున్నా వారిని ప్రశంసించండి. ఈ తరహా పద్ధతి పిల్లలను సానుకూల దృక్పథం వైపు నడిపిస్తుంది.
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు 'అది చేయకూడదు... ఇది చేయకూడదు... అలా ఉండకూడదు.. ఇలా మాట్లాడకూడదు' అని సూచనలు ఇస్తుంటారు. కాని పిల్లలను ఆదేశించడం కాదు.. ఏవి అనుసరించాలో మీరు ఆచరించి చూపాలి. ఉదాహరణకు చిందరవందరగా పడి ఉన్న వారి బొమ్మలను, పుస్తకాలను అలా పడేయకూడదు అని చెప్పడానికి బదులు వాటిని సరైన క్రమంలో సర్దుతూ వారికీ అదే చేయాలని చెప్పండి. క్రమంగా ఎటువంటి ప్రవర్తన మంచిదో, కాదో పిల్లలకు అర్థమవుతుంది. అలాగే మీ పిల్లల శక్తిసామర్థ్యాలు మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియవు. అందుకే వారితో ఎప్పుడూ కించపరిచినట్లుగా మాట్లాడకండి. ఆ ప్రవర్తన వారి సమర్ధతను నాశనం చేస్తుంది.
పిల్లలు ఉన్నట్లుండి విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకు గోడలపై అదేపనిగా పెన్నుతోనో, పెన్సిల్‌తోనో గీతలు పెట్టడం, ఏదైనా పదునైన వస్తువుతో గీరడం వంటివి చేస్తుంటారు. అప్పుడు వారిని దండించకుండా ఆ పనిని ఆపమని సున్నితంగా చెప్పండి. లేక ఇక ఆడింది చాలు అవన్నీ పక్కన పెట్టేయమని చాలా నెమ్మదిగా చెప్పి చూడండి. అప్పుడు వారు చేస్తున్న ప్రవర్తన మీకు నచ్చడం లేదని, లేదా తప్పని వారికై వారే అర్థం చేసుకుంటారు. ఇంకోసారి అలా చేయకుండా జాగ్రత్త పడతారు. అలా చేసిన వెంటనే వారిని ప్రశంసించడం మాత్రం మర్చిపోవద్దు. ఆ మెచ్చుకోలు వారి ప్రవర్తనలో తేడా గుర్తించేలా చేస్తుంది. పిల్లలు క్రమశిక్షణలో పెరగాలంటే మీ అదుపాజ్ఞల్లో నడవడం కాదు. వారికై వారే ఏది మంచో, ఏది చెడ్డో తెలుసుకునేలా చేయడం. ఆ వ్యత్యాసం గుర్తించేలా చేయడం అమ్మానాన్నల బాధ్యత.