Jan 13,2021 16:38

న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా... రైతులు కొద్దిరోజులుగా నడిరోడ్డుపైనే ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఎముకలు కొరికే చలిలో కూడా ఆత్మస్థైర్యాన్ని వీడకుండా... ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. స్వాతంత్య్రోద్యమాన్ని తలపించే ఈ ఆందోళనల్లో చిన్న పిల్లల దగ్గరనుంచి, పండు ముదుసలి వరకు..పాల్గొంటున్నారు. చివరికి మహిళలు కూడా తమ కుటుంబాలని వదిలి మరీ ఉద్యమానికి చేతనైనంత సహాయాన్ని అందిస్తున్నారు. వారి జీవితాల మీద దెబ్బకొట్టే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తేనే ఇంటి దారి పడతామని..దృఢ సంకల్పంతో ఆందోళనలు చేస్తున్నారు. ఇంతమంది రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నదే కనిపిస్తున్న మనందరికీ ... వెనక ఉన్న సమస్యలెన్నో.. అసలు వారు చలిని తట్టుకుంటున్నారా..? తినడానికి ఏదోవిధంగా వండుకొని తినేస్తున్నారు. కానీ.. వంట చేసేటప్పుడు ఏర్పడే చెత్తను ఎక్కడ పడేస్తున్నారు? అసలు నీరు తాగుతున్నారా? అసలు సురక్షితమైన మంచినీరు వారికి అందుతుందా? సరిపడా టాయిలెట్స్‌ ఉన్నాయా? ముఖ్యంగా మహిళలు రుతుక్రమంలో ఎదురయ్యే సమస్యల్ని తట్టుకోగలుగుతున్నారా? ఆందోళనకారులకు కనీస సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనే దానిపై జన్‌ స్వస్తియ అభియాన్‌ (జెఎస్‌ఎ) సర్వే నిర్వహించింది. సింఘు, టిక్రి, షాజహాన్‌పూర్‌, ఘాజిపూర్‌, పాల్వాల్‌ వంటి ఆందోళనలు చేపట్టే ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. సర్వేలో చాలా విషయాలు బయటపడ్డాయి. అందులో ప్రధానంగా కనిపించేవి.. చెత్త నిర్వహణ లేకపోవడం, సురక్షితమైన నీరు, చలిని తట్టుకునే దుస్తులు కొందరి వద్ద లేవని.. ఇలా పలు అంశాలు వెలుగుచూశాయి.
ఆందోళనలు చేస్తున్న రైతులకు ప్రస్తుతానికి తినడానికి తిండి, తాగడానికి నీటిని స్వచ్ఛంద సేవకులు, పౌర సమాజ సంఘాలు అందిస్తున్నాయి. ప్రధానమైన సమస్యల్లో నీటి సమస్య కూడా ఒకటి. రైతులకు తాగడానికి నీరు కూడా సరిగ్గాలేదని 40 శాతం మంది చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్య ఘాజిపూర్‌లో తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. కాగా నిరసన స్థలాల వద్ద సరిపడా మొబైల్‌ మరుగుదొడ్లు లేవని సర్వే పేర్కొంది. ముఖ్యంగా వాటి నిర్వహణ కూడా సరిగ్గా లేదని వెల్లడించింది. అధికారులు కూడా పట్టించుకోవడం లేదని తేల్చింది.
ఆందోళనలో పాల్గొన్న మహిళలు ఈ మరుగుదొడ్ల సమస్యతో.. తక్కువగా తినడం, నీటిని తక్కువ తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. మహిళలకు శానిటరీ పాడ్స్‌ సమస్య కూడా ప్రధానంగా ఉంది. నిరసన స్థలాల్లో శానిటరీ ప్యాడ్స్‌ మహిళలకు అందుబాటులో ఉండడం లేదు.
కొంతమందిలో మానసిక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. నిస్పృహ వల్ల మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా లేక..ఆత్మహత్య చేసుకునే ధోరణులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని సర్వే తేల్చింది.
స్వచ్ఛంద సేవకులు, పౌరులు, స్వస్తియా అభియాన్‌ వంటి సంస్థల మద్దతుతో ఇప్పటివరకు పోరాటం సుదీర్ఘంగా సాగుతోంది. ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలిని కూడా తట్టుకొని నిలబడ్డారు. ఇది వివిధ ప్రభుత్వాల ఉదాసీతనతను చూపిస్తోందని జాన్‌ స్వస్తియా అభియాన్‌ హార్యానా రాష్ట్ర సమన్వయకర్త, సర్వే బృందంలోని ప్రధాన సభ్యుడు సత్నంసింగ్‌ అన్నారు.
ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంతవరకు రైతులు ఆందోళన చేయడానికే సిద్ధంగా ఉన్నారు. సుప్రీం కోర్టు ఈ చట్టాలపై స్టే విధించినా.. దానికి రైతు సంఘాల నేతలు ససేమిరా అంటున్నారు. స్టే వారేమీ కోరలేదంటున్నారు. సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసినా.. ఆ కమిటీలో సభ్యులు కూడా చట్టాలకు మద్దుతు ఇచ్చినవారేనని.. కమిటీ ముందు కూడా హాజరకాబోమని తేల్చి చెప్పారు. ఏదిఏమైనా రైతు జీవితాలపై దెబ్బకొట్టే ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందే.

delhi formers protest