Sep 19,2023 23:59

ప్రజాశక్తి - పంగులూరు
ఒకప్పుడు గ్రామం మొత్తానికి మంచి నీటిని అందించిన బావి పాడుబడి ఉంది. దీంతో ఆ బావిని రోటరీ క్లబ్‌ మరమ్మతులు చేయించి మళ్లీ వాడుకలోకి తెచ్చింది. పంగులూరు గ్రామంలోని పోలేరమ్మ గుడి దగ్గర ఉన్న మంచినీటి బావి ఒకప్పుడు గ్రామం మొత్తానికి దాహార్తిని తీర్చేది. 1941లో అప్పటి పంగులూరు సర్పంచి బాచిన వీర రాఘవయ్య, ఉప సర్పంచ్ రావూరి బల్లెయ్య ఆధ్వర్యంలో ఈ బావిని నిర్మించారు. అప్పటి నుండి చాలా కాలం వరకు ఈ బావి నుండి గ్రామస్తులు మంచినీళ్లు పొందేవారు. తరువాత కాలంలో ఈ బావి వాడుక తగ్గిపోయి పాడుబడిపోయింది. రోటరీ గంగ ద్వారా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు తక్కువ ధరకు నాణ్యమైన మినరల్ వాటర్‌ సరఫరా చేస్తున్నారు. బావి ఒడ్డు, బేసిన్ పూర్తిగా ధ్వంసమై పోయింది. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.60వేల వ్యయంతో బావి బేసిన్‌కు పూర్తి మరమ్మత్తులు చేశారు. 8దశాబ్దాల చరిత్ర గలిగిన బావి మంచి ఆరోగ్యకరమైన మంచినీటిని అందించే బావి పాడుబడిపోవడం ఇష్టం లేక దానిని రోటరీ గంగ ద్వారా గ్రామ ప్రజలందరికీ మంచి నీటిని అందించేందుకు తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు కరణం హనుమంతరావు, రోటరీ క్యాంపు కన్వీనర్ చిలుకూరీ వీరరాఘవయ్య, కోశాధికారి గుర్రం ఆంజనేయులు మంగళవారం తెలిపారు. రోటరీ గంగ వాటర్‌ను గ్రామ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు.