May 17,2022 09:25
  • కాకినాడ జిల్లాలో లక్ష్యం
  • 5.48 లక్షల మెట్రిక్‌ టన్నులు
  • ఇప్పటి వరకూ కొన్నది.. 90 వేల మెట్రిక్‌ టన్నులు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : రైతులకు నష్ట పోనివ్వభోమని, ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేస్తుందని అధికారులు చెప్పడమే గానీ ఆచరణలో పెట్టలేకపోతున్నారు. దళారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించక్కర్లేదని, ప్రభుత్వ మద్దతు ధరతో కళ్లాల్లోనే నేరుగా ధాన్యం కొనుగోళ్లు అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే నెల రోజులుగా రబీ ధాన్యం కొనుగోళ్లు మొదలు పెట్టారు. కానీ 20 శాతం కూడా కొనుగోళ్లు చేయలేదు. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక దళారులకే ధాన్యాన్ని విక్రయిస్తున్నారు.
     కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5.48 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ 90 వేల టన్నులు అంటే 16.42 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన డబ్బులు నేటికీ రైతులకు చెల్లించలేదు. కొనుగోళ్లలో తేమశాతం నిబంధన అడ్డంకిగా మారడంతో చివరకు రైతులు దళారులకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
     జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 1.86 ఎకరాల్లో వరి సాగైంది. 6,69,679 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. 1,00,452 మెట్రిక్‌ టన్నులు స్థానిక అవసరాలకు పోగా 5,48,498 మెట్రిక్‌ టన్నులు సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు 326 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ప్రకారం ఎ-గ్రేడ్‌ రకం క్వింటాలుకు రూ.1,960 కాగా, 75 కిలోలకు రూ.1470, సాధారణ రకం క్వింటాలుకు రూ.1940 కాగా 75 కిలోలకు రూ.1450గా నిర్ణయించారు. గతనెల 11న కొనుగోళ్లను ప్రారంభించారు.
 

                                                                   దళారులకే అమ్మకాలు

కొనుగోళ్లలో తరచూ క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. 17 శాతం మించి తేమ శాతం ఉండరాదనే నిబంధనతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అసని తుపాను ప్రభావంతో జిల్లాలో తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, గోల్లప్రోలు, కరప, కాకినాడ రూరల్‌, జగ్గంపేట, కిర్లంపూడి, పెద్దాపురం, సామర్లకోట తదితర మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. తేమ శాతాన్ని తగ్గించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. ఐదారు రోజులుగా రహదారుల వెంబడి ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ఇటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని తాళ్లరేవుకు చెందిన దంగేటి కష్ణ అనే కౌలు రైతు తెలిపారు. ధాన్యాన్ని అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆలస్యం కావడంతో సచివాలయాలు, ఆర్‌బికె వెంబడి తిరిగే ఓపిక లేక చాలా మంది రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.
 

                                                                   ఆలస్యంగా చెల్లింపులు

ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతుల ఖాతాలకు సొమ్మును జమేయాల్సి ఉంది. ఈ నెల రోజుల్లో 8,269 మంది రైతుల నుంచి సుమారు 90 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినా నేటికీ ఒక్క రైతుకీ పైసా కూడా జమచేయలేదు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులను వివరణ కోరగా 21 రోజులు పూర్తవ్వలేదని నిబంధనల ప్రకారం చెల్లింపులు చేస్తామని బదులిచ్చారు.

                                                             ప్ర్రయివేటు వ్యాపారులకే అమ్మకం

అధికారుల సూచనలతో పది ఏకరాల్లో 1121 రకం సాగు చేశాను. ఆశించిన దిగుబడి రాలేదు. ఎకరాకు 25 నుంచి 30 లోపు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయింది. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో రోడ్లపై వేసి ఆరబెడుతున్నాను. దీనివల్ల రూ.2వేల అదనపు భారం పడింది. గతేడాది ఆర్‌బికెలో ధాన్యం అమ్మితే నగదు చెల్లింపులు ఆలస్యమయ్యాయి. దీంతో కళ్లం వద్దే ప్రయివేటు వ్యాపారులకు 75 కిలోలను రూ.1,030చొప్పున అమ్మేస్తున్నాను.
                                                       - అబ్బిరెడ్డి శ్రీను,కౌలు రైతు,అచ్చంపేట,సామర్లకోట మండలం