Feb 06,2023 23:57

ప్రజాశక్తి - చిలకలూరిపేట : పెరిగిన ఎండుగడ్డి, దాణా ధరలతో పాడి పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటోంది. ఒకవైపు వరి సాగు తగ్గగా మరోవైపు సాగు చేసిన పొలాల్లోనూ కోతలకు యంత్రాలను ఉపయోగిస్తుండడంతో ఎండు గడ్డి లభ్యత భారీగా తగ్గింది. దీంతో ఉన్న కొద్దిపాటి గడ్డి ధరలు పెరుగుతున్నాయి. రెండేళ్ల కిందట ఎకరా ఎండు గట్టి రూ.ఏడు వేల వరకు ఉండేది. ఈ ఏడాది అదికాస్త రూ.12-13 వేలకు పెరిగింది. దీనికి కూలి, రవాణా ఖర్చులు సుమారు రూ.3 వేల వరకూ అదనంగా పాడి రైతు భరించాల్సి వస్తోంది. తవుడు, కొబ్బరి చెక్క సైతం 30 శాతం వరకూ ధరలు పెరిగాయి. 50 కిలోల తవుడు రూ.1650, కొబ్బరి చెక్క 25 కిలోలు రూ.1150 వరకూ ధరలున్నాయి. దీంతో పశుపోషణ కష్టంగా ఉంటోందని పాడి రైతులు వాపోతున్నారు.
చిలకలూరిపేట మండలంలో 29 గ్రామాలుండగా ఆరేడు గ్రామాల్లోనే వరి సాగవుతోంది. గతంలో 1500 ఎకరాల సాగుంటే ఇప్పుడుది సుమారు 500 ఎకరాలకే పరిమితమైంది. మండలంలో సుమారు 5 వేల వరకు గేదెలు ఉంటాయని, అంచనా. మురికిపూడి, మానుకొండువారిపాలెం, కావూరు, గోవిందపురం, కమ్మవారిపాలెం, కట్టుబడివారిపాలెంలో పశు పోషణ అధికమే కాక పశుపోషణలో ప్రధానంగా మహిళలే ఉన్నారు. వ్యవసాయం నిత్యం నష్టాలిస్తుంటే మహిళలు పశుపోషణ ద్వారా కుటుంబ పోషణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
పశుపోషణలో ప్రధానమైన గడ్డి ధరలు ఏటికేడు పెరిగి పాడి రైతులకు ఆర్థికంగా మోయలేని భారమవుతోంది. ఒక్కో గేదెకు రోజుకు 10 కిలోల ఎండు గడ్డి, 20 కిలోల పచ్చిగడ్డి అవసరం. చిలకలూరిపేట ప్రాంతంలో వరిసాగు తగ్గి ఎండు గడ్డి లభ్యత లేకపో వడంతో నకరికల్లు, నరసరావుపేట, బాపట్ల ప్రాంతాల నుండి ఎండుగడ్డిని కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. పచ్చి గడ్డిని ఒక్కో కట్ట రూ.100కు కొనాల్సి వస్తోంది. పచ్చి గడ్డి పెంపకానికి అవసరమైన ఇంగ్లీషు గడ్డి పెంపకానికి ప్రభుత్వ సహకారం ఏ మాత్రమూ అందడం లేదు.
చిలకలూరిపేట సమీపంలో పెదనందిపాడు మార్గం వైపు 20 ఎకరాల్లో మురుగునీరు ఆధారంగా ఇగ్లీషు గడ్డిని సాగు చేస్తున్నారు. ఇందుకు 5 సెంట్లకు రూ.3 వేల వరకూ కౌలు చెల్లిస్తున్నారు. రామచంద్రాపురం, మురికిపూడి గ్రామాల్లోని మరో 10 ఎకరాల్లోనూ బోర్ల కింద ఇంగ్లీషు గడ్డి సాగు చేస్తున్నారు. విడిగా కొనాలంటే పచ్చిగడ్డి కట్ట రూ.100 అవుతోంది. ఇవన్నీ భరించలేని పాడిరైతులు దాణా, గడ్డి ఖర్చులు తగ్గించుకుంటే ఆ ప్రభా వం గేదె ఆరోగ్యంతోపాటు పాల దిగుబడిపైనా పడు తోందని పాడి రైతులు వాపోతున్నారు. వీటిపై వివరణ కోసం పశు సంవర్థక శాఖాధికారులను సంప్రదించే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు.
వ్యవసాయంలో నష్టాలతో పశు పోషణ
సాంబిరెడ్డి, పాడిరైతు, మానుకొండువారిపాలెం.

రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నా. ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయి. దీంతో పశుపోషణే ఆధారంగా జీవిస్తున్నాం. ఇప్పుడు ఇది కూడా కష్టమవుతోంది. ప్రభుత్వం రాయితీపై దాణా, గడ్డి విత్తనాలు సకాలంలో సరఫరా చేస్తే మాకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి. దీనికితోడు గేదెల కొనుగోలుకు వడ్డీలేని రుణాలు, వాటికి బీమా సదుపాయం, పాలకు సరైన ధర కల్పిస్తే మా జీవనోపాధికి ఢోకా ఉండదు.