Nov 25,2022 11:52

పాట్నా  :   ఫోక్సో వంటి కఠిన చట్టాలు అమల్లోకి వచ్చినా అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. పట్టణాల్లో ఫిర్యాదులు వరకు వెళ్తున్నా.. బాధితులకు న్యాయం జరిగేందుకు ఏళ్లకు ఏళ్లు పడుతోంది. గ్రామాల్లో పరిస్థితి సరేసరి. గ్రామ పెద్దలే తమకు తోచిన తీర్పులు ఇచ్చి.. చేతులు దులుపుకుంటున్నారు. తాజాగా ఇటువంటి ఘటన బీహార్‌లోని నవాడా జిల్లాలో జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి గ్రామ పెద్దలు ఐదు గుంజీళ్లు శిక్షగా విధించడం గమనార్హం. వివరాల ప్రకారం.. ఐదేళ్లచిన్నారికి చాక్లెట్లు ఆశచూపి నిందితుడు పౌల్ట్రీ ఫామ్‌లోకి తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు పంచాయితీలో ఫిర్యాదు చేశారు. విచారించిన గ్రామపెద్దలు అతను అత్యాచారానికి పాల్పడలేదని నిర్థారించారు. చిన్నారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లినందుకు మాత్రం ఐదు గుంజీళ్లు శిక్ష విధించారు. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు భారతదేశంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలానికి, వివక్షతకు చిహ్నంగా ఉందని మండిపడుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం స్పందించాల్సిందిగా పేర్కొంటూ ఈ వీడియోను బీహార్‌ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి పోస్ట్‌ చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, నిందితునితో పాటు అతనికి మద్దతు ఇచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌పి తెలిపారు.