Aug 02,2022 18:41

న్యూఢిల్లీ :  రూ.15 లక్షల విలువైన అమెరికా డాలర్లను అప్పడాల ప్యాకెట్ల ద్వారా తరలించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. అయితే తనిఖీల్లో ఈ నగదు బయటపడటంతో అధికారుల చేతికి చిక్కాడు. ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి బ్యాంకాక్‌కు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి  చేరుకున్నాడు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు అతడి లగేజీని చెక్‌ చేయగా మసాలా దినుసుల బాక్సులు, అప్పడాల ప్యాకెట్లు  కనిపించాయి. అయితే అప్పడాల మధ్య సుమారు 19,900 డాలర్లు ( రూ. 15 లక్షలు ) దాచినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని ఎయిర్‌ విస్తారా ఫ్లైట్‌ నుండి దించి సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు. పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని ఎందుకు తీసుకు వెళ్తుందీ వివరించలేకపోయారని  అన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.