May 13,2022 09:21
  • 6-23నెలల చిన్నారుల్లో 'మినిమం డైట్‌' లేనివారు 89శాతం
  • కారణం..పేదరికం, అవిద్య, పోషకాహారం అందుబాటులో లేకపోవటం..
  • యుపి, గుజరాత్‌లో పరిస్థితి మరీ దారుణం : ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వే
  • మెరుగ్గా ఉన్న రాష్ట్రాలు మేఘాలయ, కేరళ, సిక్కిం, లడఖ్‌, పాండిచ్చెరీ

న్యూఢిల్లీ : గర్భస్థ శిశువు దగ్గర్నుంచీ.. రెండేళ్ల పిల్లాడు అయ్యేంత వరకు వారికి పోషకాహారం అందటం అత్యంత కీలకమైంది. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మానసిక, శారీరక ఎదుగుదల సరిగా ఉండదు. ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశంలో 6 నుంచి 23 నెలల చిన్నారుల్లో 89శాతం మందికి కనీసంలో కనీసం పోషకాహారం (మినిమం డైట్‌) అందటం లేదని 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5' (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) ఆందోళన వ్యక్తం చేసింది. నిర్దేశిత ప్రమాణాలమేరకు మినిమం డైట్‌ పొందని శిశువులు, చిన్నారులు 2015-16లో 91.3శాతముంటే, 2019-20లో 89శాతంగా నమోదైందని తాజా సర్వే పేర్కొన్నది.
     గణాంకాల్లో స్వల్ప మెరుగుదల ఉన్నా, పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని సర్వే తేల్చింది. సమాజంలో పేదరికం, అవిద్య, అవగాహనా లోపం, పప్పులు, కూరగాయలు, పండ్లు, గుడ్లు అందుబాటులో లేకపోవటం.. వంటివి సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు డాక్టర్‌ బసంత్‌ కార్‌ చెప్పారు. శిశువు జన్మించిన తర్వాత మొదటి వెయ్యి రోజులు చాలా కీలకమని, భాషా సామర్థ్యాలు, స్పందన, ఇంద్రియ జ్ఞానం పెంపొందటం వంటివి వెయ్యి రోజుల్లోనే జరుగుతాయని ఆయన అన్నారు. మెదడు పెరుగుదలలో 80శాతం 23నెలల్లోనే ఉంటుందన్నారు.
 

                                                               మినిమం డైట్‌ అంటే..

నవజాత శిశువుకు రెండేండ్ల వరకు తల్లిపాలు అందించాలి. భిన్నమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఇవి రెండూ చాలా ముఖ్యమని 'సేవ్‌ ద చిల్డ్రన్‌' డిప్యూటీ డైరెక్టర్‌ అంతర్యామి డాష్‌ చెప్పారు. ''ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నాలుగు ఆహార గ్రూపుల్లో కనీసం రెండు ఆహార గ్రూపులు చిన్నారులకు అందితే..దానిని 'మినిమం డైట్‌'గా పేర్కొంటారు. మనదేశంలో 35శాతం మంది నవజాత శిశువులకు తల్లిపాలు సమృద్ధిగా అందుతున్నాయి. శిశువుల్లో 25శాతం మందికి భిన్నమైన ఆహారం దక్కుతోంది. ఈ అంశాలకు సంబంధించి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-4 సర్వేతో పోల్చితే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 సర్వేనాటికి గణాంకాల్లో పెద్దగా మార్పులేదు.
 

                                                                 ప్రమాద ఘంటికలు

గర్భస్థ శిశువు, చిన్నారులకు పోషకాహారం అందుబాటులో లేకపోతే ముందు ముందు అనేక దుష్ఫరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచంలో పోషకాహారం పొందలేని బాలలు అత్యధికంగా భారత్‌లో ఉన్నారు. మినిమం డైట్‌..గణాంకాలు పడిపోవటం పోషకాహార లేమిని మరింత పెంచే అవకాశముంది. తాజా సర్వే ప్రకారం, మినిమం డైట్‌ పొందుతున్న శిశువులు, చిన్నారులు (6-23నెలలు) ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో 5.9శాతం మంది మాత్రమే ఉన్నారు. అత్యధికంగా మేఘాలయలో 28.5శాతం నమోదైంది.
 

                                                                      కేరళ టాప్‌

కనీస పోషకాహార లభ్యతలో మేఘాలయ, కేరళ(23.3శాతం), సిక్కిం (23.8శాతం), లడఖ్‌ (23.1శాతం), పుదుచ్చెరీ (22.9శాతం) రాష్ట్రాలు మెరుగైన గణాంకాలు నమోదుచేశాయి. జాతీయ సగటు 11శాతం కన్నా దిగువన ఉన్న రాష్ట్రాలు.. తెలంగాణ-9శాతం, అసోం-7.2శాతం, రాజస్థాన్‌-8.3శాతం, మహారాష్ట్ర-8.9 శాతం, ఏపీ-9శాతం. సరైన.. కనీస పోషక విలువలున్న ఆహారం అందుబాటులో లేకపోతే నవజాత శిశువులు, చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల దారుణంగా దెబ్బతింటుంది. సూక్ష్మ పోషకాల లోపం, ఎత్తుకు తగిన బరువు లేకపోవటం..వంటివి వేధిస్తాయి.