Apr 17,2021 07:48

* 'ప్రజాశక్తి'తో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, భారత మానసిక వైద్య సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజు
విశాఖపట్నం ప్రతినిధి : మనిషి మృగంగా వ్యవహరించడం వెనుక సామాజిక కారణాలూ ఉంటాయని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, భారత మానసిక వైద్య సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌.ఎన్‌.రాజు తెలిపారు. విశాఖ నగరంలో గురువారం జరిగిన రెండు ఘటనల్లో పది మంది దారుణ మరణానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో 'ప్రజాశక్తి'కి శుక్రవారం ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే...
 

మృగత్వం-విచక్షణా జ్ఞానం
ఓ జీవి బతకడానికి క్రూరస్వభావం అనేది ప్రకృతి పరిణామక్రమంలో రూపుదిద్దుకున్న సహజసిద్ధ లక్షణం. ఇది తనను తాను రక్షించుకోవడానికి జీవికి ఉన్న సాధనం కూడా. శరీర వ్యవస్థ నిర్మాణంలోనే జీవి రక్షణకు క్రూరత్వం అనేది ఉంటుంది. అయితే, మనిషి తన క్రూరమైన లక్షణాలను నియంత్రించుకొనే వ్యవస్థ శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. ఏ పని ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయకూడదు? ఘోరమైన సంఘటనకు దిగడం అన్యాయమా? న్యాయమా? అనేది నిర్ణయించుకొనే నియంత్రణే విచక్షణ. ఆత్మరక్షణకు నేరం చేసే సందర్భంలోనూ విచక్షణ అనేది న్యాయన్యాయాలను నిర్ణయించుకొని తప్పు చేయకుండా నియంత్రి స్తుంది. చేస్తున్న పని వాస్తవికత, నైతికతకు దగ్గరగా ఉందా? లేదా? అని మనిషి ఆలోచించుకోవాలి. వాస్తవి కత పద్ధతంటే నేనీ పనిచేయడం వల్ల నష్ట ముందా? లాభ ముందా? భవిష్య త్తులో జరగబోయే పర్యవసానాలు, పరిణా మాలు ఎలా ఉండబో తాయో ఆలోచించడం. నైతికత అంటే ఎదుటవాడిని బాధపెట్టడం, హింసించడం, మోసగించడం, అన్యాయం చేయడం మంచిది కాదని నిశ్చితాభిప్రాయానికి రావడం.
 

విచక్షణ ఎందుకు కోల్పోతారు
వాస్తవికత, నైతికత మధ్యలో ఉండే సంతులనాత్మక ప్రవర్తనను బ్యాలెన్స్‌ చేసుకోలేనప్పుడు విచక్షణ కోల్పోయి చేసిన పనులే నేరాలు. ఒక్కోసారి మానసిక స్థితి బాగోలేక నేరాలకు పాల్పడవచ్చు. పర్యవసానాలు గుర్తించకా చేయొచ్చు. విచక్షణ కోల్పోయినప్పుడు మనుషులు మృగాలుగా మారతారు. విచక్షణను నిర్ణయించే మెదడు ప్రమాదంలో దెబ్బతిన్నవారిలో, ఫిట్స్‌తో బాధపడుతున్న వారిలో కొందరు బయటకు ఆరోగ్యంగా కన్పిస్తున్నా విచక్షణ కోల్పోయి అర్థరహితంగా ప్రవర్తిస్తారు. వారిలో కొందరిలో నేర లక్షణం బయటపడుతుంది. ఈ పని చేయాలా? లేదా? అనేది ఆలోచించరు. ఒక్కోసారి విచక్షణరహితంగా ప్రవర్తించడానికి తీవ్రమైన మానసిక ఒత్తిడి, సాంఘిక అవలక్షణాలు, అసమానతలు, అవమానాలు కూడా ప్రభావితం చేస్తాయి. ఈ కోపంలోనే మనిషి తప్పులు, నేరాలు చేస్తుంటారు. వాస్తవికతకు దూరంగా ఉంటూ కోపంతో చేసిన తప్పులివి.
సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థల ప్రభావం
చుట్టూ ఉన్న పరిసరాలు తనకు ప్రశాంత వాతావరణం కల్పించనప్పుడు, బతకనీయలేనప్పుడు, విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అవమానాలు, అసమానతలతో రగిలిపోతున్నప్పుడు, కుటుంబ, సమాజపరంగా అన్యాయం జరిగినప్పుడు విచక్షణను కోల్పోయి ప్రవర్తించడం జరుగుతుంది. ఉద్రేకాలు, భావోద్వేగాలు చాలా ముఖ్యమైనవి. కోపం ఎక్కువైనప్పుడు క్రూరత్వంగా మారడం, నియంత్రణ కోల్పోవడం జరుగుతుంటాయి. సుపీరియారిటీ, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్‌ మనిషిలో ఉంటాయి. ప్రతి మనిషీ ఇంకొకరికంటే గొప్పగా, ఉన్నతంగా ఉండాలన్న క్రూరత్వంలో నుంచి ఎదుట మనిషిని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం వంటి చర్యల్లో చంపడం కూడా ఒక చర్యగా ఎంచుకుంటారు. అందులో భాగంగా మనుషులు మానవ మృగాలుగా మారే అవకాశం లేకపోలేదు. నైతికతను సమాజం బోధించాలి. నేర్పాలి. విద్యా వ్యవస్థ ఇందుకు దోహదపడాలి. నీతినియమాలను, నైతికతను పెంచే బోధన విద్యా వ్యవస్థలో ఉంటే కొంతమందిలోనైనా నైతికత పెరిగే అవకాశాలు ఉంటాయి. నైతికంగా పెరగడానికి చిన్నప్పటి నుంచే బీజాలు పడాలి. అందుకు కుటుంబం, సమాజం, ప్రభుత్వం అత్యంత బాధ్యతగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం పెరిగే వాతావరణం కల్పించాలి. మానసిక ఆరోగ్యంపై అవగాహన ఉండాలి. శారీరక ఆరోగ్యానికి ఇస్తోన్న ప్రాధాన్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వాలి. మానసికంగా బాగుంటే మనిషి జీవితం బాగుంటుంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబమంతా కలిసి తినడం, కలిసి మాట్లాడుకోవడం, సమస్యలుంటే చర్చించుకొని పరిష్కరించుకోవడం వంటివి చేయాలి. మనిషి ప్రవర్తనలో తేడాను గుర్తిస్తే మానసిక వైద్య నిపుణులను వెంటనే సంప్రదించాలి. మానసిక స్థితి సాధారణ పరిస్థితికి వచ్చే వరకు వైద్యుని సలహాలను అనుసరించాలి. మనిషిలోని క్రూరత్వాన్ని, భావదారిద్య్రాన్ని తగ్గించడానికి నైతికపరమైన విద్యావ్యవస్థ, సాంఘిక వ్యవస్థలు ఏర్పాటు కావాలి.