Nov 22,2021 07:05

'మనం వుండాల్సింది కమిటీల్లో కాదు, కమ్యూనిటీలో, జర్నలిస్టుల్లో కాదు, జనంలో' అని కవితాత్మకంగా సామాజిక కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ తరిమెల అమరనాథరెడ్డి తన అనుభవాలను కథలుగా మలిచి 'అమర్‌ టాక్స్‌' పేరుతో మన ముందుంచారు. తరిమెల అనగానే మనకు అనంతపురం జిల్లాకు చెందిన తరిమెల నాగిరెడ్డి గుర్తుకొస్తారు. ఆయన ప్రజల పక్షాన నిలబడి పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. శ్రీశ్రీ ఆయనను అనంతపురం 'వజ్రం'గా కీర్తించారు. ఆయనకు దగ్గర బంధువు, అదే ఊరికి చెందిన తరిమెల అమరనాథరెడ్డి కూడా పేదల పక్షాన నిలబడడం ఆయన ప్రభావం ఉండడం వల్లే.
అమరనాథరెడ్డి మానవత అనే సంస్థను ఏర్పాటు చేసి పేదలకు ఎప్పుడు అవసరమొచ్చినా రాత్రనక పగలనక రక్తదాతలను గుర్తించి వారితో ఆపత్కాలంలో అవసరమైన వారికి రక్త సహాయం చేయిస్తూ ఉంటారు. కళాశాలలకు వెళ్ళి రక్త సహాయంపై ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఆయన ఈ సంస్థను ఏర్పాటు చేయకముందు అనంతపురంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టి అనేక ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. తన జీవితంలో ఎదురైన అనేక అనుభవాలను కథల రూపంలో తన సంభాషణల్లో పొందుపరిచారు. డా|| అబ్రహం కోవూర్‌, ప్రేమానంద్‌ల పరిచయంతో ఆయన హేతువాదిగా మారాడు. అప్పటినుంచి ప్రజల్లో పనిచేస్తున్న సందర్భంలో ఎదురైన అనుభవాలను అమర్‌ టాక్స్‌లో పంచుకున్నారు. ఈ పుస్తకంలో18 కథలు, ఒక ఉపన్యాసం ఉన్నాయి. ఇవన్నీ హేతువాద భావాల్ని ప్రేరేపిస్తాయి. మతోన్మాదులకు చెంపపెట్టులా తగులుతాయి. యువతరానికి భావివికాసం కలిగిస్తాయి.
సమాజంలో అనేక కులాలున్నాయి. వాటి మధ్య అనేక హెచ్చుతగ్గులున్నాయి. దీన్ని చూసే జాషువా 'కసరి బుసకొట్టు నాల్గుపడగల హైందవ నాగరాజు' అని నిరసిం చాడు. దళితులను కొందరు తక్కువగా చూడటం ఇప్పటికీ సమాజంలో ఉన్న వాస్తవం. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వివక్ష విపరీతంగా ఉండేది. గ్రామాల్లోనైతే మరీ తీవ్రం. 'యాడపెట్టే వాన్ని ఆడపెట్టాలి' అనుకుంటారు పెత్తందార్లు. 'పేదోల్లకు మర్యాదిస్తే రేపొద్దున్న ఈ చిల్లర నా కొడుకులు మన నెత్తికెక్కుతారు' అని బహిరంగంగానే అంటుంటారు వాళ్ళు. నాగన్న ఎరికల కులస్థుడు. నల్లప్ప, మల్లన్న కురవ కులస్థులు. వీరి పొలానికి పోవాలంటే ఎరికల నాగన్న పొలం లోంచి పోవాలి. అందుకు దోవ (దారి) కావాలి. వీళ్ళ మధ్య అనుకోకుండా ఏర్పడిన ఘర్షణతో ఎరికల నాగన్న తన భూమిలోంచి పోవద్దని అడ్డుకుని పంచాయతీకి పిలిచాడు. ఆ సందర్భంలో అమర్‌ తన అగ్రవర్ణతత్వాన్ని వదుల్చుకొన్నవాడు కావడం వల్ల, అభ్యుదయ వాది కావడం వల్ల తను, తనతో పాటు వచ్చిన వారు కింద కూర్చుని, ఎరికల నాగన్నను అక్కడ ఉన్న ఒకే ఒక కుర్చీలో కూర్చోమన్నాడు. అది నాగన్న మనసును తాకింది. ఆ కుర్చీలో కూర్చుని తనను మనిషిగా చూసిన అమర్‌తో 'వాళ్ళు దారికోసం ఇచ్చే 10 సెంట్ల భూమి నాకొద్దు. ఇంతకుముందు ఎట్లా సాగుతూ వుంటే వాళ్ళను అట్ల పొమ్మను' అని అంటాడు. ప్రస్తుతం పరిస్థితులు మారినాయి. ఒకరు చెబితే వినే పరిస్థితి లేదు. కులసంఘాలు పెరిగాయి. కులఘర్షణలు పెరిగాయి. పల్లెల్లో పెత్తందార్లు తగ్గిపోయారు. కులాల మధ్య, చిచ్చు పెరిగింది. ఇలాంటి సమస్యలన్నీ పోలీసు స్టేషన్లలోనూ, కోర్టుల్లోనూ తెల్లారు తున్నాయి. ఇలాంటి కులవివక్షకు సంబంధించిన కథ 'మారాలి'. ఇవన్నీ మన సమాజం ఇంకా ఆధునికం కాలేదని తెలియజేస్తాయి.
మతాన్ని రెచ్చగొట్టి ఢిల్లీలో గద్దెనెక్కాలనుకున్న మతతత్వ రాజకీయ పార్టీ ప్రతి పండగను, ఆటను తన రాజకీయ ప్రయోజనానికి వాడుకుంటూనే ఉంది. వినాయకచవితి వస్తే, ప్రజల్లో వినాయకునిపై భక్తిభావం కన్నా మతోన్మాదాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవిప్పుడు రాజకీయ వేదికలుగా మారాయి. ఇలాంటి మతోన్మాద శక్తులు పెరగ డానికి కారణం గతంలోలాగా నేడు అభ్యుదయ వాదులు వీటిపైన దృష్టి పెట్టకపోవడమని అమర్‌ అంటాడు. క్రికెట్‌ చీడ కథలో సాటి మనిషిని కులమతాలకతీతంగా ప్రేమించడం దేశభక్తి అవుతుంది గాని క్రికెట్‌ ఆటలో ఎదుటి దేశం ఓడిపోవాలని కోరుకోవడం దేశభక్తిగా ప్రచారం చేయడం సరికాదని అమర్‌ ఒకచోట అంటారు.
మరోచోట రాజకీయ నాయకులు 'జై జవాన్‌ - డై కిసాన్‌' అంటున్నారని చెపుతాడు అమర్‌. ఇంకోచోట రాజకీయం లాభసాటి వ్యాపారమైందని, అందువల్లే ఎన్నికల్లో కోట్లు పెట్టి గెలుస్తున్నారు. గెలిచినా తమ పార్టీ అధికారంలోకి రాకపోతే అధికార పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. మన రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్‌ఆర్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశంలోకి వెళ్ళి పోయారు. ఆ మధ్య తెలుగుదేశం ఎంపీలు ముగ్గురు బిజెపిలోకి వెళ్ళిపోయారు. ఇలా నీతిలేకుండా రాజకీయ నాయకులుంటే పేదోళ్ళలో నీతి లేదని చెప్పడం సరికాదని అమర్‌ అంటారు. ఈ సంగతినే కథలో చెపుతాడు. విద్యావంతులైన కొంతమంది పట్టభద్రులు, ఉద్యోగస్తులు ఎన్నికల్లో ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారు. సమాజంలో ఇలాంటి నీచ సంస్క ృతి రావడానికి కారణమైన రాజకీయ పార్టీలను సామాజిక వేత్తలు తప్పుపట్టాలి.
దాంపత్యం సజావుగా జరగాలంటే ఆలోచనలు కలవాలి, అంతేగాని లోచనాలు కాదని చెపుతాడు అమర్‌ ఆషాడం పెళ్ళి కథలో. తన భార్యతో ఆషాడంలో పెళ్ళిళ్ళు జరగవని అంటారు గాని పురోహితులు మాత్రం తమ పిల్లలకు ఆషాడంలోనే పెళ్ళి చేస్తున్నారని, ఎందుకంటే అప్పుడు ఫంక్షన్‌ హాలు చవగ్గా దొరకడమేనని చెపుతాడు ఇదే కథలో. ఇది సమాజంలో ఉన్న వైరుధ్యాన్ని ఎత్తి చూపిస్తుంది.
అనంతపురం జిల్లాలో కరువు పిలవకుండానే వస్తుంది. పంటలు సరిగా పండక ప్రతిఏటా వ్యవసాయాన్ని వదిలేసేవారి సంఖ్య పెరిగింది. వ్యవసాయం చేసుకునే వారి పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదు. పట్నంలో పకోడీలు అమ్ముకునే వానికైనా పిల్లను ఇస్తారు గానీ పల్లెల్లో పదెకరాలు పొలమున్నోనికి ఇవ్వని పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి పాలకులు చేసే సాయం ఉత్తుత్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రైతులు కిడ్నీలు అమ్ముకునే దారుణం దాపురించిన పరిస్థితిని వర్ణించే కథ 'సరికొత్త పంట'.
ప్రపంచీకరణతో వ్యవసాయానికి సాయం నిలిపేశారు. ప్రపంచబ్యాంకు సలహా మేరకే వ్యవసాయ రంగం నుంచి రైతులను బయటకు రప్పించాలని మూడు దశాబ్దాల కిందటే నిర్ణయించారు. దాంతో యంత్రాలను దిగుమతి చేసు కున్నారు. పామోలిన్‌, సిల్క్‌, ఉల్లి మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను విచ్చలవిడిగా దిగుమతి చేసుకుంటున్నారు. బహుళజాతి కంపెనీలను దేశంలోకి అనుమతిచ్చారు. పెప్సీ, కోకోకోలా వంటి పానీయ కంపెనీలు మొదలుకొని అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ కంపెనీల వ్యాపారానికి మనదేశం స్థావరంగా మారింది. దాంతో వ్యవసాయ రంగం నానాటికి దెబ్బతిని పోయింది. దాంతో వ్యవసాయ కూలీలు, యువరైతులు ఆ రంగం నుంచి తప్పుకున్నారు. ఐటి రంగం, సేవారంగం, బిటి రంగం పెరిగింది. ఉపాధి కోసం యువత ఈ రంగాల్లోకి వచ్చారు. వ్యవసాయంలో దిగుబడులు రాక కొంతమంది, వచ్చినా గిట్టుబాటు లేక మరికొంతమంది అప్పుల పాలై ఎలాంటి సాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనుంచి వచ్చిన కథే 'సరికొత్త పంట'. దేశంలో వున్న ఒక హృదయ విదారక యథార్థ దృశ్యం ఈ కథ.
సమాజంలో ఉన్న అహేతుకతను, మూఢవిశ్వాసాలను కుట్ర కథలో వివరించారు. పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగానే ఈ జన్మలో పేదరికంలో జన్మిస్తారని, అదంతా మన తలరాతని, కర్మసిద్ధాంతం చెపుతుంది. ఇదో కుట్ర అంటూ ఆనాడు రాజులు తమ పండితుల ద్వారా తలరాత పేరుతో కోట్లాదిగా వున్న పేద ప్రజలు తిరగబడకుండా ఉండటానికి ఇలాంటివి ప్రచారం చేయించారు. అలాగే జ్యోతిషం, వాస్తు కూడా మూఢ నమ్మకాలేనని, పేదోడు పస్తులతో చస్తుంటే ఉన్నోడు వాస్తుతో చస్తాడని సామాజిక యదార్థ చిత్రాన్ని మనకు ఆవిష్కరిస్తాడు.
సమాజంలో శాస్త్రీయ భావాలు పెరగడానికి రచయితలు ఇలాంటి కథలు రాయాలి. వాస్తవానికి నేడు చాలామంది సాహిత్యకారుల్లో అనేక మూఢ నమ్మకాలున్నాయి. ఒకవైపున సైన్సు ఫలితాలను అనుభవి స్తూనే పూర్వులు చెప్పిన వాటిల్లో శాస్త్రీయత ఎంత వుందో తెలుసుకోకుండా నమ్మేస్తూ, వాటినే తమ రచనల్లో మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు. సమాజ మార్పుకు సాహిత్యం దోహదం చేస్తుంది. పైగా యువతరం మానసిక వికాసానికి శాస్త్రీయ దక్పథంతో, సామాజిక విలువలతో ఉన్న కథలు తోడ్పడతాయి. సాహిత్యకారులు 'అమర్‌ టాక్స్‌' కథలను చదివి ఆ దిశగా ముందడుగు వేస్తారని ఆశిద్దాం. హేతుబద్ధ ఆలోచనలు రేకెత్తిస్తూ హాస్యస్ఫోరకంగా రాసిన అమరనాథ రెడ్డి ఇలాంటి రచనలు మరిన్ని వెలువరించాలని కోరుకుందాం.

                                               - పిళ్లా కుమారస్వామి  .. 94901 22229