Jan 02,2022 14:59

'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ప్రియాంక జవాల్కర్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మొదటి సినిమాతోనే అందరినీ ఆకర్షించిన ఈ నటి వైవిధ్యమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ.. ఆచితూచి అడుగులేస్తున్నారు. మూడంటే మూడు షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటించిన ఈమె ఇప్పుడు హీరోయిన్‌గా బిజీ అయ్యారు. ఇటీవల 'గమనం'లో నటించి, మంచిపేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కెరీర్‌ గురించి కొన్ని విశేషాలను పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందాం..!

అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ నటి మొదట మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అనంతరం షార్ట్‌ ఫిలిమ్స్‌లో హీరోయిన్‌గా నటిం చారు. విజరు దేవరకొండ సరసన 'టాక్సీవాలా' సినిమాతో హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్‌ తెలుగు తెరకు పరిచయమయ్యారు. ప్రియాంక అనంతపురంలోనే కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ క్లాతింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు చేశారు. 'టాక్సీవాలా'లో తన కాస్ట్యూమ్స్‌ను ప్రియాంకనే డిజైన్‌ చేసుకుంటారు.
అయితే కెరీర్‌ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానంగా.. 'ఆచితూచి సినిమాలు చేస్తూ ఉంటే కెరీర్‌ నెమ్మదిస్తుందనే భయం నాకూ ఉంది. అలాగని వచ్చిన సినిమాలన్నీ ఫటాఫట్‌ చేస్తూ పోతే.. వరుస పరాజయాలూ ఎదుర్కోక తప్పదు. అందుకే ఆలస్యమైనా.. మనసుకు నచ్చిన కథలే ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నా' అంటూ సమాధానం చెప్పారు ప్రియాంక. ఇటీవలే 'తిమ్మరుసు', 'ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం' చిత్రాలతో పలకరించిన ఈ నటి ఇప్పుడు 'గమనం'తో మరోసారి అలరించారు. సుజనారావు తెరకెక్కించిన ఈ చిత్రంలో శ్రియ ప్రధానపాత్రలో నటించారు. ప్రియాంకకు జోడీగా శివ కందుకూరి నటించారు.
మనసుకు హత్తుకునే కథ..
'మనసులకు హత్తుకునే ఓ ఆసక్తికర కథాంశంతో సుజనారావు ఈ సినిమాని తెరకెక్కించారు. దీనికోసం నన్ను తొలుత నిర్మాత జ్ఞానశేఖర్‌ సంప్రదించారు. ఓ ముస్లిం యువతి పాత్ర ఉంది చేయాలన్నారు. ఆ పాత్ర కోసం బుర్ఖా వేసి, లుక్‌ టెస్ట్‌ చేశారు. అన్నీ సరిగ్గా కుదరడంతో నన్ను ఇందులోకి తీసుకున్నారు. ఇందులో నా పాత్ర పేరు జారా. నా పాత్రకు ఎక్కువ సంభాషణలు ఉండవు. నటనకు చాలా ఆస్కారముంది. కళ్లతోనే హావభావాలు పలికించాల్సి ఉంటుంది. అదే నాకు కాస్త సవాల్‌గా అనిపించింది' అని తెలిపారు.అయితే 'నేనీ సినిమా కన్నా ముందు చాలా కమర్షియల్‌ కథలు విన్నాను. ఏదీ అంతగా నచ్చలేదు. 'గమనం' కథ వినగానే నచ్చేసింది. 'వేదం' సినిమాలా ఉందనిపించింది. 'నిర్మాత, సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నేను ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలే చేయడంతో ఈ స్టోరీ వినగానే రియాలిటీకి దగ్గరగా, డిఫరెంట్‌గా ఉందనిపించింది. అయితే ముస్లిం క్యారెక్టర్‌ కావడంతో లుక్‌ టెస్ట్‌ చేసి, చూశాక ఫైనల్‌ చేశారు. జారా అనే ముస్లిం అమ్మాయిగా నటించాను. దీనికి తోడు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని తెలియగానే.. ఈ అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని నిర్ణయించేసుకున్నా. లేడీ డైరెక్టర్‌ కావడం వల్ల సుజనాతో ఎక్కువగా కనెక్ట్‌ అయ్యాను' అని తెలిపారు.
'ఇందులో నేను శివ కందుకూరికి జోడీగా కనిపిస్తా. తను క్రికెటర్‌ కావాలని కలలు కంటుంటే.. నేనతన్ని ప్రేమిస్తూ తిరుగుతుంటా.. మా ప్రేమకథ చాలా కొత్తగా, మనసులకు హత్తుకునేలా ఉంటుంది. మా కథలో ఓ చిన్న సందేశమూ కనిపిస్తుంది. నిజానికి శివతో గతంలో 'చూసీ చూడంగానే' సినిమా చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల అది మిస్సయ్యింది. తర్వాత ఓ చిత్రం అనుకున్నా.. అదీ అలాగే చేజారింది. మొత్తానికి ఈ 'గమనం'తో మా జోడీ సరిగ్గా కుదిరింది' అని వివరించారు.
ఆ విజయాన్ని సరిగ్గా వాడుకోలేకపోయా..
'టాక్సీవాలా' విజయాన్ని సరిగ్గా వాడుకోలేకపోయానని కొందరు అంటుంటారు. నిజానికి నాకూ అదే అనిపిస్తుంది. కానీ, పరిస్థితిని మనం మార్చలేం కదా! కొన్ని చిత్రాలు మనకు వద్దనుకున్నా వస్తాయి. ఇంకొన్ని చేయాలని తాపత్రయపడినా చేజారుతుంటాయి. నాకు అందరి హీరోలతోనూ కలిసి నటించాలనుంది. కథ మనసుకు నచ్చి, నటనకు ప్రాధాన్యముంటే ఎలాంటి పాత్ర పోషించడానికైనా సిద్ధమే. అలాంటప్పుడు బోల్డ్‌ క్యారెక్టరైనా చేస్తాను. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నానని సెలవిచ్చారు ప్రియాంక.
కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్‌ కష్టమనిపించింది..
'చిన్నప్పటి నుంచి నాకు ముస్లిం ఫ్రెండ్స్‌ ఉండడం హెల్ప్‌ అయ్యింది. హీరోతో లవ్‌ట్రాక్‌, మరోవైపు ఇంట్లో పేరెంట్స్‌తో కాన్‌ఫ్లిక్ట్‌ ఉంటాయి. యాక్టింగ్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌. డైలాగ్స్‌ తక్కువ, ఎక్స్‌ప్రెషన్స్‌ ఎక్కువ. కళ్లతోనే ఎక్స్‌ప్రెషన్స్‌ పండించడం కొంత కష్టమనిపించింది. కానీ బాగా కనెక్ట్‌ అయ్యాను. వెరీ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌. షూటింగ్‌ అయ్యాక కూడా జారా పాత్రలాగే బిహేవ్‌ చేస్తున్నానని ఇంట్లోవాళ్లు, ఫ్రెండ్స్‌ చెప్పారు. ఈ తరహా ఆఫ్‌ బీట్‌ క్యారెక్టర్స్‌ దొరకడం అరుదు. నా కెరీర్‌కి హెల్ప్‌ అవుతుందని భావిస్తున్నాను' అని ప్రియాంక పేర్కొంది.

బైయో డేటా :
పేరు : ప్రియాంక జవాల్కర్‌

ఇతర పేర్లు : పింకు
పుట్టిన తేదీ : నవంబర్‌ 12, 1992
పుట్టిన ప్రాంతం : అనంతపురం
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : బి.టెక్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌
హాబీస్‌ : ట్రావెలింగ్‌, డ్యాన్సింగ్‌, రీడింగ్‌