Nov 25,2022 12:34

న్యూఢిల్లీ   :  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను హత్యచేసేందుకు బిజెపి కుట్ర పన్నుతోందంటూ మనీష్‌ సిసోడియా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లో ఆప్‌ చేతుల్లో ఓటమి పాలౌతామని బిజెపి భయపడుతోందని  సిసోడియా పేర్కొన్నారు. దీంతో కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని, బిజెపి ఎంపి మనోజ్‌ తివారీ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్‌ భద్రతపై తనకు ఆందోళనగా ఉందని అన్నారు.
కాగా, భారీ అవినీతి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, రేపిస్టులతో స్నేహం, జైల్లో ఆప్‌ మంత్రికి సకల సౌకర్యాలతో మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్‌ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని గురువారం మనోజ్‌ తివారీ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆప్‌ ఎమ్మెల్యేలపై ప్రజలు దాడులు చేస్తున్న ఘటనలను చూస్తున్నామని, ఇలాంటి అనుభవం కేజ్రీవాల్‌కు ఎదురు కాకూడదని కోరుకుంటున్నట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై సిసోడియా స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ హత్యకు కుట్ర పన్నుతున్నట్లు ఆయన ట్వీట్‌ బయట పెట్టిందని అన్నారు. కేజ్రీవాల్‌ పై దాడి చేయాలని ఇప్పటికే తన గూండాలను మనోజ్‌ తివారీ పురమాయించినట్లు బహిరంగంగా చెప్పారని, ఇప్పటికే పక్కా ప్లాన్‌ ను సిద్ధం చేశారని అన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు ఆప్‌ భయపడదని హెచ్చరించారు. బిజెపి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని, ఎన్నికల్లో వారిని ఓడిస్తారని అన్నారు.