Jun 23,2021 16:00

కడియం (తూర్పు గోదావరి) : వర్షాలు పడటంతో పలు రాష్ట్రాల నుండి కడియం నర్సరీ మొక్కలకు ఆర్డర్‌లు వస్తున్నాయి. కరోనా కారణంగా మొక్కల ఎగుమతులు నిలిచి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులకు ఈ ఆర్డర్లతో కొంత ఊరట లభిస్తుంది. కానీ లోడింగ్‌ ధరలు రైతులను గగ్గోలు పెట్టిస్తున్నాయి. మొక్కలను వాహనాలలో లోడింగ్‌ చేయడానికి టన్నుకి 300 రూపాయలు తీసుకొనే బంటా 600 నుండి 700 వసూలు చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులను , బంటా మేస్త్రీలను కూర్చోబెట్టి అసోసియేషన్‌ పెద్దలు లోడింగ్‌ ధరలు నిర్ణయిస్తారు. దీనిని ఇరువురూ ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ అసోసియేషన్‌ పెద్దలను ధిక్కరించి బంటాలు లోడింగ్‌ ధరలను వసూలు చేయడం, లోడింగ్‌ ధరలతో నిమిత్తం లేకుండా వారి అవసరం మేరకు కొందరు రైతులు అధిక ధరలు చెల్లించడంతో అధిక శాతం నర్సరీ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోడింగ్‌ ధరల ప్రభావంతో మొక్కల కొనుగోలు దారులు వెనకడుగువేసే ప్రమాదం ఉంటుందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కడియం ప్రాంతంలో లోడింగ్‌ ఛార్జీలు మరే రాష్ట్రంలోనూ లేవని, మరలా లోడింగ్‌ ధరలు పెంచితే కొనుగోలు దారులు తమ ఆర్డర్లు కూడా రద్దు చేసుకొనే ప్రమాదం ఉంటుందని, దీనిపై నర్సరీ అసోసియేషన్‌ పెద్దలు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.