Jul 29,2021 22:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పెగాసస్‌, రైతు సమస్యలపై ప్రతిపక్షాలు తమ ఆందోళన కొనసాగించడంతో పార్లమెంటు ఉభయ సభలు గురువారం వాయిదా పడ్డాయి. లోక్‌సభ గురువారం ఉదయం సమావేశం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా కొందరు కాంగ్రెస్‌ ఎంపిలు ప్లకార్డులు, పత్రాలు చించి వాటిని స్పీకర్‌ స్థానం వైపు, అధికార పక్షం వైపు విసిరివేసిన బుధవారం నాటి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు మాత్రం పెగాసస్‌ నిఘా, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనను కొనసాగించారు. దీంతో సభను 11.30 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం ప్రారంభమైన సభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిఘా ఆపాలని, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని, హౌం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని నినదించారు . దీంతో పలుమార్లు సభ వాయిదా పడి, ఏకంగా శుక్రవారానికి వాయిదా పడింది.
అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి పెగాసస్‌, ఇతర అంశాలపై చర్చకు పట్టుబడుతూ 267 నిబంధన కింద వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. చైర్మన్‌ వెంకయ్య నాయుడు వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకసారి, మధ్యాహ్నం 2 గంటలకు మరో సారి వాయిదా వేశారు. ఆ తరువాత కూడా ఆందోళన కొనసాగడంతో పలుమార్లు వాయిదా పడి, చివరికి శుక్రవారానికి వాయిదా పడింది.


మూడు బిల్లులు ఆమోదం
ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్‌ ఉభయ సభల్లో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. ఎటువంటి చర్చ లేకుండానే ముజువాణి ఓటుతో బిల్లులను ఆమోదించారు. రాజ్యసభలో ఫ్యాక్టరింగ్‌ రెగ్యులేషన్‌ సవరణ బిల్లు, కోకోనట్‌ డవలప్‌మెంట్‌ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందగా, లోక్‌సభలో ఎయిర్‌పోర్టు ఎకానమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా సవరణ బిల్లు ఆమోదం పొందింది.


రైతు సమస్యలపై ప్రతిపక్షాలు ఆందోళన
రైతు సమస్యలపై కాంగ్రెస్‌, ఎస్‌ఎడి, బిఎస్‌పి ఎంపిలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ ఎంపిలు మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టగా, ఎస్‌ఎడి, బిఎస్‌పి ఎంపిలు కలిసి గేట్‌ నెంబర్‌ 4 వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేబూని రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. బిఎస్‌పి ఎంపి రితేష్‌ పాండ్యా మీడియాతో మాట్లాడుతూ పెగాసస్‌ ప్రజాస్వామ్యంపై దాడని అన్నారు. రైతుల సమస్యలు, పెగాసస్‌ నిఘా, ధరలు పెరుగుదలపై చర్చించే వరకు సభ ఎలా పని చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. పెరిగిన పెట్రోల్‌, డిజిల్‌, వంట గ్యాస్‌తో సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్‌ ఎంపి రిపున్‌ బోరా భారీ ప్లకార్డలను ధరించి, సైకిల్‌పై పార్లమెంట్‌ చేరుకున్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపైన పార్లమెంట్‌ చర్చించాలని డిమాండ్‌ చేశారు.