May 05,2021 07:44

   కరోనా మహమ్మారి దేశాన్ని వల్లకాడుగా మార్చేస్తున్న తీరు చూసి అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతున్నా ప్రధాని నరేంద్ర మోడీలో ఇసుమంత కూడా చలనం లేకపోవడం విస్తుగొలుపుతున్నది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు (దీనిలోభాగమే ఆరోగ్యహక్కు ), సమానత్వ హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అత్యున్నత న్యాయస్థానం చేత గుర్తు చేయించుకోవాల్సి రావడం సిగ్గు చేటు. సార్వత్రిక ఉచిత టీకా కార్యక్రమాన్ని కేంద్రమే భరించాలని, రాష్ట్ర ప్రభుత్వాలపై దీనిని నెట్టివేయడం తగదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అయినా, మోడీ మౌనం వీడలేదు. ఏప్రిల్‌9న ప్రధాని ప్రకటించిన కొత్త వ్యాక్సినేషన్‌ విధానం ప్రజల ప్రాణాల కన్నా కార్పొరేట్ల లాభాలే ప్రభుత్వానికి ముఖ్యం అని చెప్పకనే చెప్తున్నది. ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం సూటిగా అనక పోయినా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 45 ఏళ్లు పైబడినవారికందరికీ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తుందని, 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్‌ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టడం సరికాదని చెప్పడమేగాక, ఈ కొత్త విధానం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని పేర్కొంది. దేశ జనాభాలో 45 ఏళ్లు దాటినవారు 34 కోట్ల మంది వరకు ఉంటే, 45 ఏళ్లలోపు వయోజనులు 59 కోట్ల మంది దాకా ఉన్నారు. ఇందుకోసం దాదాపు 1200 కోట్ల డోసులు అవసరమవుతాయి. వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులతో బేరసారాలాడి రాష్ట్రాలే వీటిని కొనుక్కోవాలని కేంద్రం చెప్పడం దాని బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వనరుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రాలు వాటి ఆర్థిక పరిస్థితిని బట్టి వ్యాక్సిన్‌ను ఎంతమేరకు కొనుగోలు చేయగలవన్నది ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా బాగా చితికిపోయిన రాష్ట్రాలు వీటిని అమలు చేయలేకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌తో సహా కొన్ని రాష్ట్రాలు 18 ఏళ్లు దాటినవారికి టీకాలు ఇప్పుడప్పుడే వేయలేమని కేంద్రానికి లేఖల ద్వారా తెలియజేశాయి. వ్యాక్సిన్‌ కొరత వల్ల 45 ఏళ్ల పైబడినవారికి కూడా వ్యాక్సినేషన్‌ అందుబాటులో లేదు. కరోనాపై పోరుకు ప్రజలను సన్నద్ధం చేయడంలో వ్యాక్సిన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. టీకా వేస్తే ప్రజలకు ధైర్యం వస్తుంది. వారిలో పోరాడే శక్తి పెరుగుతుంది. అంతిమంగా అది కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దోహదపడుతుంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ విధానం ఈ వ్యాధిపై పోరును బలోపేతం చేయడానికి ఎంతమాత్రం తోడ్పడేదిగా లేదు. పేదరికం, అసమానతలు తీవ్రంగా ఉన్నటువంటి భారత్‌ వంటి సమాజంలో తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుందని సుప్రీం కోర్టే పేర్కొన్నదంటే ఇది ఎంతటి ముదనష్టపు విధానమో అర్థమవుతుంది. వ్యాక్సిన్‌ సేకరణలో కేంద్రీకరణ , పంపిణీలో వికేంద్రీకరణ ఉండాలన్న సుప్రీం కోర్టు ఆదేశం రాష్ట్రాల హక్కులను కబళించ జూస్తున్న మోడీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది.
   వ్యాక్సిన్‌ అనే కాదు, ఆక్సిజన్‌ సమస్యను పరిష్కరించడంలోను మోడీ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు, కోర్టు ధిక్కార నేరం కింద ఎందుకు చర్య తీసుకోరాదో చెప్పాలని ప్రశ్నించింది. మూడు వారాలుగా ఆక్సిజన్‌ సంక్షోభం వెంటాడుతుంటే కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగినట్టు వ్యవహరించడం వల్లే నేడు ఈ దుస్థితి దాపురించింది. బెడ్‌ కోసం, ఆక్సిజన్‌ కోసం, వ్యాక్సిన్‌ కోసం, ఇంటి నుంచి శవాన్ని తరలించడం కోసం, చివరికి శ్మశానంలో చోటు కోసం ఇలా ప్రతి దశలోనూ ప్రజలు పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. కోవిడ్‌-19 మొదటి దఫా అనుభవం కళ్లెదుట ఉన్నప్పటికీ, రెండో దశలో ఆక్సిజన్‌ సమస్యను నివారించేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్రం నిర్లక్ష్యం వహించింది. దాని పర్యవసానంగానే నేడు ఆక్సిజన్‌ అందక చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇది ముమ్మాటికీ మోడీ సర్కార్‌ వైఫల్యమే. ఆక్సిజన్‌ కొరతను తీర్చేందుకుౖ చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు చెప్పిన తరువాత అయినా మోడీ ప్రభుత్వం మౌనం వీడాలి. వివక్షాపూరితమైన వ్యాక్సిన్‌ విధానాన్ని రద్దు చేసి, సార్వత్రిక ఉచిత వ్యాక్సిన్‌ విధానాన్ని కొత్తగా తీసుకురావాలి. కరోనా ఆసుపత్రులకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ అందించేందుకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.