Jul 03,2022 07:26

* హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు * నేడు పరేడ్‌ మైదానంలో బహిరంగ సభ

* మోడీ హాజరు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ హెచ్‌ఐసిసిలో శనివారం ప్రారంభమయ్యాయి. ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పదాధికారుల సమావేశం నిర్వహించారు. మోడీ వచ్చిన తర్వాత సాయంత్రం 4గంటలకు జాతీయ కార్యవర్గం ప్రారంభమైంది. జెపి నడ్డా ప్రారంభోపన్యసం చేశారు. అనంతరం మోడీ కార్యవర్గాన్ని ఉద్దేశించి కీలకోపన్యాసం చేశారు. కేంద్ర మంత్రులతో పాటు బిజెపి పాలిత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కార్యవర్గ సభ్యులు మొత్తం 348 మంది సమావేశానికి హాజరయ్యారు. ఉదయం జరిగిన పదాధికారుల సమావేశంలో ప్రజా సమస్యల ప్రస్తావనే రాలేదు. సాయంత్రం జరిగిన నేషనల్‌ కౌన్సిల్‌లో పేదరికం, మహిళా సాధికారిత, కేంద్రం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించినట్లు తెలిసింది. నిరుద్యోగం, ఆకలి చావులు, అధిక ధరలు, ఘర్షణలు, రైతు సమస్యలు,..ఇలా దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్న వేళ జరుగుతున్న బిజెపి ఉన్నతస్థాయి సమావేశంలో వాటికి పరిష్కారం లభిస్తుందని భావించినా నిరాశే మిగిలింది. ప్రధాని మోడీ, అమిత్‌ షాల భజనకే బిజెపి నేతలు ప్రాధాన్యమిచ్చారు. కరోనా సమయంలో మోడీ అద్భుతంగా పనిచేశారని బిజెపి కార్యవర్గం కితాబిచ్చింది. అధికారానికి దూరంగా ఉన్న తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పాగా వేసేందుకు అమలుచేసే వ్యూహాలపైనే బిజెపి కార్యవర్గంలో ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. త్వరలో ఎన్నికలు జరిగే గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మీడియాకు వెల్లడించారు. దేశంలో పేదల అభ్యున్నతి, మహిళా సాధికారితపై కార్యవర్గంలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయంపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాలకు కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. దేశ వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై కృషిచేయాలని మోడీ దిశానిర్దేశం చేశారు. ప్రధాని పదవిని కెసిఆర్‌ అవమానించారని ఆమె వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్‌ తమిళి సై, బిజెపి నేతలు, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సిఎస్‌, డిజిపి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.