Jan 23,2022 08:04
  • ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో జనం విలవిల : సిపిఎం ఆన్‌లైన్‌ బహిరంగ సభలో సీతారాం ఏచూరి
  • ఆస్తులన్నీ అమ్మేస్తున్న మోడీ : బృందా కరత్‌
  • సిపిఎం తెలంగాణ రాష్ట్ర మహాసభ ప్రారంభం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే దేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షించబడతాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ఎర్రజెండాకు పూర్వవైభవం తీసుకురావాలని, ప్రజా ఉద్యమాలు బలపర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభ ప్రారంభం సందర్భంగా ఎస్‌వికెలో నిర్వహించిన ఆన్‌లైన్‌ బహిరంగ సభలో శనివారం ఆయన మాట్లాడారు. ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ శక్తులు లూటీ చేస్తున్నాయని,ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో మోడీ ప్రభుత్వం దేశాన్ని సర్వనాశనం చేస్తోందని విమర్శించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను అమ్ముతోందన్నారు. వచ్చే నెల 23, 24 తేదీల్లో కార్మికవర్గం రెండు రోజుల సమ్మెకు సిద్ధం అవుతున్నా మోడీ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు లాభం చేకూర్చడం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. తద్వారా బిజెపికి ఆ కార్పొరేట్‌ సంస్థలు తమ లాభాల్లో నుంచి పొలిటికల్‌ ఫండ్‌ ఇస్తున్నాయని వివరించారు. దేశంలో రాజకీయ కుంభకోణాలు చట్టబద్ధం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 112 మంది శతకోటీశర్వుల వద్ద 55 శాతం సంపద కేంద్రీకృతం కావడంతో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయన్నారు. దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలు లూటీ చేస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగ పునాదులపై మోడీ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేస్తోందని అన్నారు. రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుంజుకుంటోందని తెలిపారు. ఉమ్మడి జాబితాలోని వ్యవసాయంపై కేంద్రం మూడు చట్టాలు తెచ్చిందని, విద్యుత్‌ సవరణ బిల్లును రూపొందించిందని, రాష్ట్ర జాబితాలోని విద్యా రంగం పైనా నూతన విద్యావిధానాన్ని తెచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్ర జాబితాలోని సహకార రంగాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకుందని తెలిపారు. ప్రతిపక్ష నాయకులపైనా, ప్రశ్నించే వారిపైనా సిబిఐ, ఇడిలను ఉసిగొల్పుతోందన్నారు. రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలిచినా బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్‌ షా అంటున్నారంటే, వారు ఏ స్థాయికి తెగబడ్డారో అర్థమవుతోందని పేర్కొన్నారు. యుపిలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినా మోడీ, ఆదిత్యనాథ్‌పై ఇసి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రైతాంగ ఉద్యమం దేశానికే స్ఫూర్తిదాయమని, పోరాటాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచిందని పేర్కొన్నారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్‌లో కేరళలోని కన్నూర్‌లో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలో కార్యాచరణను రూపొందిస్తామన్నారు. వామపక్ష పార్టీలను కలుపుకుని మోడీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమిస్తామని తెలిపారు.
 

                                          పోరాడే వారికి ఎర్రజెండా ఆయుధం : బృందా కరత్‌

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను, ఆస్తులను అమ్మేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కరత్‌ విమర్శించారు. నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) పేరుతో రూ.6 లక్షల కోట్ల సంపదను ప్రైవేట్‌ వారికి కట్టబెడుతోందని తెలిపారు. లౌకికవాదంపై, మైనార్టీలపై, దళితులపై బిజెపి దాడి చేస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులపై దాడి జరుగుతున్నా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఉద్యమించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. బంగారు తెలంగాణ అన్న పాలకులు రాష్ట్రాన్ని బంగారు గుడ్డు పెట్టే బాతుగా వాడుకున్నారని విమర్శించారు. దొరల తెలంగాణకు వ్యతిరేకంగా ప్రజా తెలంగాణ దిశగా సిపిఎం మహాసభలో చర్చించాలని సూచించారు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లి కెసిఆర్‌ను అడుగడుగునా నిలదీస్తామన్నారు.