May 15,2022 07:38
  • పెట్రోల్‌ ధర తగ్గింపు, గ్యాస్‌ సబ్సిడీ హామీలు ఏమయ్యాయి?
  • పోర్టును బలవంతంగా రుద్దితే ప్రతిఘటన తప్పదు : వి.శ్రీనివాసరావు
  • టెక్కలిలో పినకాన కృష్ణమూర్తి భవన్‌కు శంకుస్థాపన

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి
పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గిస్తామంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసగించిన మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శంభాన వీధిలో పినకాన కృష్ణమూర్తి స్మారక భవనం (సిపిఎం కార్యాలయం) శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం భావనపాడు పోర్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పలాసలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లీటరు రూ.46 ఉన్న పెట్రోల్‌ను రూ.37కు తగ్గిస్తామని 2014 ఎన్నికల ముందు మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రూ.120కు పెంచడం మోసం కాదా అన్ని ప్రశ్నించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీని కొనసాగిస్తానని చెప్పి రూ.450 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1050 చేశారని తెలిపారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీని నిలబెట్టుకోలేని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కొత్త నాటకమాడుతోందని విమర్శించారు. రైతులు తమంతట తాము వ్యవసాయాన్ని వదులుకొనేలా పాలకులు ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరిత విధానాలను అవలంభిస్తున్నారని విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మోడీ, వారి అప్పులను రెండింతలు చేశారని ఎద్దేవా చేశారు. బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి నుంచి దృష్టి మరల్చేందుకు మతాల మధ్య చిచ్చు పెడుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. పోర్టులు, ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్‌ కంపెనీలకు భూములను కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం అన్యాయం చేస్తోన్నా వైసిపి, టిడిపి నోరు మెదపడం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, విశాఖ రైల్వే జోన్‌ తదితర హామీలతో పాటు రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన రూ.37 వేల కోట్లను అడిగే దమ్ము జగన్‌కు లేక జనాలపై భారాలు వేస్తున్నారని విమర్శించారు. పినకాన కృష్ణమూర్తితో తనకు ఉన్న అనుబంధాన్ని శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. పాలకుల నిర్బంధాన్ని ఎదురొడ్డి అలుపెరగని పోరాటాలు చేశారని కొనియాడారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీలు ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దక్షిణకొరియా కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టాలని చూస్తోందన్నారు. ఎల్‌ఐసి, ఎయిరిండియా వంటి ప్రభుత్వరంగ సంస్థలనూ వదలడం లేదని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, పినకాన కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు అజరుకుమార్‌, రాణి, ధర్మారావు పాల్గొన్నారు
భావనపాడు పోర్టు ప్రభావిత గ్రామాల్లో పర్యటన
స్థానికుల అభిప్రాయానికి భిన్నంగా భావనపాడు పోర్టును రుద్దితే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. భావనపాడు పోర్టు ప్రభావిత ప్రాంతాలైన సంతబొమ్మాళి మండలం మూలపేట, విష్ణుచక్రం, పెద్దలింగోడు, తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రైతులు, మత్స్యకారులు, స్థానిక ప్రజలతో మాట్లాడారు. అనంతరం కాశీబుగ్గలోని ఓ కల్యాణ మండపంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణాన్ని ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. పోర్టుపై ప్రజాభిప్రాయ సేకరణ, భూసేకరణ జరగకుండా నిర్మాణానికి టెండర్లను ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. భూసేకరణ చట్టం ప్రకారం రైతుల అంగీకారం లేకుండా భూసేకరణ చేయడానికి వీల్లేదన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు మాట్లాడుతూ మత్స్యకార భరోసా అని ఒక వైపు చెప్తున్న ప్రభుత్వం మరోపక్క వారి జీవనోపాధిని దెబ్బతీస్తోందని విమర్శించారు.