May 13,2022 22:08
  • కోల్‌కతాలో డివైఎఫ్‌ఐ 11వ ఆలిండియా మహాసభలు ఆరంభం
  • అరుణారుణమయమైన సభా ప్రాంగణం
  • వేలాదిమందితో భారీ ప్రదర్శన
  • స్పూర్తినిస్తున్న శ్రీలంక యువత పోరాటం : సలీం

కోల్‌కతా : యువత ఆశలను అడియాసలు చేసిన మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ)11వ జాతీయ మహాసభల ప్రారంభ సందర్భంగా గురువారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ బహిరంగ సభనుద్దేశించి ఆయన మాట్లాడుతూ,''ప్రభుత్వం ఆస్తులకు మేనేజర్‌గా వుంది. కానీ ఆ ఆస్తులకు యజమానులు సామాన్య ప్రజలే, యజమానికి, మేనేజర్‌ను మార్చే హక్కు వుంది. కాబట్టి కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చాలి. అలా మారిస్తేనే ఈ దేశాన్ని కాపాడగలుగుతాం'' అని ఏచూరి ఉద్బోధించారు. వేలాదిమంది యువత ఇందులో పాల్గన్నారు. శుక్రవారం నుండి మహాసభలు ప్రారంభమయ్యాయి. మహాసభల వేదికపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డివైఎఫ్‌ఐ మాజీ జాతీయ అధ్యక్షులు మహ్మద్‌సలీం, డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి అభరు ముఖర్జీ, రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీలు ఆశీనులయ్యారు. ఇటీవల హత్యకు గురైన డివైఎఫ్‌ఐ కార్యకర్త బిద్యుత్‌ మోండాల్‌ తల్లి అమలా మోండాల్‌, విద్యార్ధి నాయకుడు అనీష్‌ ఖాన్‌ తండ్రి సలేమ్‌ ఖాన్‌లు కూడా వేదికపై ఆశీనులైనవారిలో వున్నారు. మహాసభల ప్రాంగణమంతా అరుణారుణమయంగా మారింది. భగత్‌సింగ్‌, చే గువేరా, ఇటీవల హత్యకు గురైన విదార్ధి నాయకుడు అనీష్‌ ఖాన్‌ వంటి యువజన నేతల పోస్టర్లతో ఆ ప్రాంతమంతా కళకళ లాడింది. సాల్ట్‌ లేక్‌లోని ఈస్ట్రన్‌ జోనల్‌ కల్చరల్‌ సెంటర్‌లో గురువారం ప్రారంభమైన ఈ మహాసభలు నాలుగు రోజుల పాటు సాగతాయి.
మహాసభల ప్రారంభానికి ముందు భారీ ప్రదర్శన జరిగింది. ఇటీవల బంకూరాలో మరణించిన డివైఎఫ్‌ఐ కార్యకర్త మైదుల్‌ ఇస్లామ్‌ మిద్యా గ్రామం నుండి కోల్‌కతాలోని సభా వేదిక వద్దకు ర్యాలీ చేరుకునే వరకు ప్రతి చోటా ప్రజాదరణ ప్రముఖంగా లభించింది. సెల్దా నుండి హౌరా స్టేషన్‌ వరకు రెడ్‌ వలంటీర్ల్లు ప్రదర్శన నిర్వహించారు. భగత్‌ సింగ్‌ వంటి యువ నేతల కటౌట్లు దారి మధ్యలో అలరించాయి. ర్యాలీకి ప్రారంభంలో ప్రజా ఉద్యమాలపై ఇప్టా రచించిన గీతాలను వలంటీర్లు ఆలపించారు.
సభలో ఏచూరి ప్రసంగిస్తూ, ఢిల్లీలో పాలక ప్రభుత్వం తరపున అమలు చేస్తున్న బుల్డోజరు విధానం ఎన్నాళ్ళో కొనసాగదని అన్నారు. కేంద్రం అనుసరించే ఈ విధానాలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాల్సింది యువతేనని అన్నారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్‌ బుల్డోజరు విధానాన్ని అనుసరిస్తోంది. అంతకుముందు యూదులపై హిట్లర్‌ ఇదే పంథాను అనుసరించారు. ఇప్పుడు దేశంలోని ముస్లిం జనాభాపై మోడీ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలను ఇస్తామని మోడీ చెప్పారు. అంటే 8ఏళ్ళలో 16కోట్ల ఉద్యోగాలను అందాల్సిన తరుణంలో, ప్రస్తుతం దేశంలోని యువత ఉద్యోగాలు దొరుకుతాయన్న ఆశలు వదులుకుంటోందని అన్నారు. దాంతో మతోన్మాదంతో వారిని రెచ్చిగొడుతూ విప్లవ ప్రతీఘాత శక్తులుగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాప్తి చేస్తున్న మతోన్మాదం దేశ లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని అన్నారు. 'శాంతియుతంగా ప్రదర్శనలు జరుపుకుంటామంటే మనకు అనుమతులు దొరకవు, కానీ వారు మాత్రం రామనవమి, హనుమాన్‌ జయంతి ప్రదర్శనల్లో ఆయుధాలు ధరించి మరీ పాల్గంటారు. ఆ ప్రదర్శనలు సాగిన ప్రాంతాల్లో మతోన్మాదాన్ని వ్యాప్తి చేస్తూ వెళతారు. ఈ దేశంలో ముస్లిం మైనారిటీ జనాభాపై తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి.'' అని ఏచూరి పేర్కొన్నారు.
పాలక తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కూడా ఏచూరి విమర్శనాస్త్రాలు సంధించారు. మితవాద శక్తులతో ప్రభుత్వం సన్నిహితంగా మెలిగినంత కాలమూ మతోన్మాద శక్తులను అణచివేయలేమని హెచ్చరించారు.

మోడీని గద్దె దింపాల్సింది మీరే ! : యువతకు సీతారాం ఏచూరి పిలుపు
ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా వున్న మహ్మద్‌ సలీం మాట్లాడుతూ, ప్రభుత్వ అణచివేత చర్యల ద్వారా పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు, ఆందోళనలను అణచివేయలేరని అన్నారు. మొయిదుల్‌, అనీస్‌ ఖాన్‌, బిద్యుత్‌ మోండాల్‌ వంటి వారు అమరవీరులయ్యారు. కానీ, ఇలా అమరవీరుల జాబితా పెరిగేకొద్దీ నిరసనలు తెలియచేయాలన్న డివైఎఫ్‌ఐ కృతనిశ్చయం మరింత బలోపేతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలోని, బెంగాల్‌లోని 'నిరంకుశ ప్రభుత్వాల'కు శ్రీలంకలోని పరిస్థితులు ఒక హెచ్చరిక వంటివని సలీమ్‌ పేర్కొన్నారు.
మీనాక్షి ముఖర్జీ మాట్లాడుతూ, మమత పాలనలో విజృంభించిన దాడులతో డివైఎఫ్‌ఐ కార్యకర్తలు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో వివరించారు. క్రికెట్‌లో సిక్సర్‌ స్థాయిలో ఈనాడు ఉద్యమాలు కూడా అదే రీతిలో వృద్ధి చెందుతాయని అన్నారు.
ఎ.ఎ.రహీమ్‌ మాట్లాడుతూ, దేశంలో నేడు నెలకొన్న పరిస్థితులను వివరించారు. ఈనాడు మతోన్మాద శక్తులు ధర్మ సంసద్‌ల పేరుతో ముస్లింలను ఊచకోత కోయాలంటూ పిలుపివ్వడం ద్వారా ఎలా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో వివరించారు. పశ్చిమ బెంగాల్‌ అన్ని రకాలుగా తిరోగమన దిశలో పయనిస్తోందన్నారు. దేశంలోని ప్రజలందరికీ పని కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమాలను ఉధృతం చేయాలని అభరు ముఖర్జీ పిలుపిచ్చారు. కుల, మత, వర్గాలకు అతీతంగా అందరికీ పని అన్న వైఖరిని డివైఎఫ్‌ఐ తీసుకుందని అన్నారు.