Feb 22,2021 22:39

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న రైతు ఉద్యమం మరింత ఉదృతంగా మారుతోంది. సంయుక్త కిసాన్‌ మోర్చా ప్రకటించిన తాజా కార్యాచరణ నేటి (మంగళవారం)నుండి ప్రారంభం కానుండటంతో పోరాట కేంద్రాల వద్ద రైతుల సంఖ్య పెరుగుతోంది. తమ ప్రాంతాలలో సమ్మేళనాలు జరుగుతుండటంతో సొంత ప్రాంతాలకు వెళ్లిన రైతులు తిరిగి చేరుకుంటున్నారు. పంజాబ్‌.హర్యానా, ఉత్తరప్రదేశ్‌లతో పాటు పలు రాష్ట్రాల నుండి సోమవారం సాయంత్రానికే పెద్ద సంఖ్యలో రైతులు పోరాట కేంద్రాల వద్దకు వచ్చారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు పగ్రి సాంబాల్‌ (తలపాగా కాపాడుకో) కార్యక్రమం మంగళవారం జరగనున్న సంగతి తెలిసిందే. పోరాట కేంద్రాల వద్ద ఉన్న వారితో పాటు ఎక్కడికక్కడ రైతులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మరోవైపు పంజాబ్‌లో మహా కిసాన్‌ సమ్మేళన్‌ నిర్వహించాలని ఆప్‌ నిర్ణయించింది. మోగా జిల్లాలో మార్చి 21వ తేదిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పంజాబ్‌ ఆప్‌ శాఖ ప్రకటించింది. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి క్రేజివాల్‌ను ఆహ్వానించినట్లు తెలిపింది. రైతు సంఘాల తాజా కార్యాచరణ నేపథ్యంలో ఢిల్లీకి వస్తున్న రైతులను పోలీసులు గ్రామాల్లోనే అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఈ తరహా చర్యలకు దిగితే, శాంతియతంగా అక్కడే నిరసన తెలపాలని బికెయు నేత రాజేవాల్‌ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎన్ని రోజులు ఆందోళన చేసినా చట్టాలు రద్దు కావంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చేసిన వ్యాఖ్యలపై సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు ఉద్యమాన్ని స్వయంగా వ్యవసాయ మంత్రే చిన్నబుచ్చే విధంగా ప్రకటనలు చేయడం అభ్యంతకరమని ఎస్‌కెఎం సమన్వయకర్త దర్శన్‌ పాల్‌ పేర్కొన్నారు.


స్వామి సహజనంద్‌ కు నివాళి
ఎఐకెఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామి సహజనంద్‌ సరస్వతి ఎఐకెఎస్‌ నేతలు ఘనంగా నివాళులర్పించారు. స్వామి సహజనంద్‌ సరస్వతి జయంతి సందర్భంగా సోమవారం నాడు స్థానిక ఎఐకెఎస్‌ కేంద్ర కార్యాలయంలో కార్యక్రమం జరిగింది. ఎఐకెఎస్‌ అధ్యక్షుడు అశోక్‌ ధవాలే, ప్రధాన కార్యదర్శి హన్నన్‌ మొల్లా, జాయింట్‌ సెక్రటరీ ఎన్‌కె శుక్లా, ఆర్థిక కార్యదర్శి పి కఅష్ణ ప్రసాద్‌, ఎఐఎడబ్ల్యు జాయింట్‌ సెక్రటరీ విక్రమ్‌ సింగ్‌తో పాటు ఇతర నేతలు స్వామీజీకి నివాళులర్పించారు.