Jul 29,2021 07:01

మహాత్ముడు నవ్వుతున్నాడు
మనమంతా స్వేచ్ఛగా ఉన్నామని
ఆయనకేం తెలుసు...?
రోజుకో సమస్యపై ఉద్యమాలు చేస్తున్నామని
ఆయన సత్యాగ్రహాలకు
ఏలికలు గ్రహణం పట్టిస్తున్నారని.

శాంతి దూత టోపీతో దర్జాగా ఉన్నాడు
మనమంతా ప్రశాంతంగా ఉన్నామని
ఆయనకేం తెలుసు...?
అసమానతలతో అల్లాడుతున్నామని
ఆయన ప్రేమించే గులాబి లాంటి పిల్లలను
మృగాళ్ళు నలిపేస్తున్నారని.

రాజ్యాంగ నిర్మాత రాజసంగా ఉన్నాడు
అణగారిన వర్గాలు ఆనందంగా ఉన్నాయని
ఆయనకేం తెలుసు...?
ఆయన రాసిన రాజ్యాంగ విలువలు
వలవలు లేక విలవిల లాడుతున్నాయని.

ఉక్కుమనిషి ఉల్లాసంగా ఉన్నాడు
మనమంతా ఒక్క తాటిపై ఐక్యంగా ఉన్నామని
ఆయనకేం తెలుసు....?
మతాలు, ప్రాంతాల వారీగా వాదులాడుకుంటున్నామని
ఆయన నెరవేర్చిన ఆశయాలకు
తూట్లు పొడుస్తున్నారని.

అందుకే ఓ మహాత్ములారా....
నేటి భారతావనిలో మరలా పుట్టి
సాధించండి మరో స్వాతంత్య్రాన్ని.
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌: 7780277240