
మాస్కో : నాటో సైనిక కూటమిలో చేరేందుకు ఫిన్లాండ్, స్వీడన్లు తీసుకున్న నిర్ణయాలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం మరో తీవ్ర తప్పిదమని, దీనిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ''ఇది, సుదీర్ఘకాలంలో తీవ్ర పర్యవసానాలు కలిగించగల మరో ఘోరమైన తప్పిదం'' అని రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రిబకోవ్ మీడియాతో వ్యాఖ్యానించారు. సైనిక ఉద్రిక్తతల స్థాయి పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలనే ఆలోచనలు సరిగా లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. ఇటువంటి నిర్ణయాలతో ఇరుదేశాల భద్రత పటిష్టం కాబోదని అన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో విడిచిపెడతామని భావించరాదని, మాస్కో తగిన రీతిలో చర్యలు తీసుకుంటుందని రిబకోవ్ స్పష్టం చేశారు. తప్పనిసరిగా ప్రతీకార చర్యలు తీసుకుంటామని మాస్కో ఫిన్లాండ్ను హెచ్చరించింది. శనివారం ఫిన్లాండ్ ప్రధాని సాలి నితినిస్తో రష్యా అధినేత పుతిన్‌తో మాట్లాడారు. ఈ నిర్ణయంతో ముందుకు సాగడం తప్పు కాగలదని పుతిన్ స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ తెలిపింది. నాటోలో చేరాలన్న ఉద్దేశాన్ని ఫిన్లాండ్ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.
తటస్థతకు స్వీడన్ స్వస్తి
తటస్థతకు స్వీడన్ స్వస్తి పలికింది. స్వీడన్ పాలక పార్టీ కూడా నాటోలో చేరికకు మద్దతు ఇస్తోంది. పొరుగున గల ఫిన్లాండ్తో చేతులు కలిపింది. నాటో సభ్యత్వం కోసం సోమవారం దరఖాస్తు చేసింది. ఏ గ్రూపులోనూ చేరరాదని 200 సంవత్సరాలకు పైబడి అమలు చేస్తూ వస్తున్న నిర్ణయాన్ని సడలించింది. దేశ భద్రతా విధానంలో ఇదొక చారిత్రక మార్పు అని స్వీడన్ ప్రధాని మాగ్దలీనా ఆండర్సన్ వ్యాఖ్యానించారు.