Aug 05,2022 23:25

ప్రజాశక్తి - విశాఖపట్నం
స్వాతంత్య్రోద్యమంలో విశాఖ జిల్లాకు చెందిన ఎందరో మహిళలు సమరశీల పాత్ర పోషించారు. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం సాగిన మహోద్యమంలో నిప్పుకణికలయ్యారు. వీరందరి పేర్లూ చరిత్రలో లిఖించబడక పోయినప్పటికీ స్వాతంత్య్రోద్యమానికి వీరిచ్చిన తోడ్పాటు, మిలిటెన్సీ పోరాటాల్లో వీరు ప్రదర్శించిన తెగువ, ధైర్యసాహసాలూ... ఎంతో కీలకమైనవి. స్త్రీలు చదువుకోవడాన్ని సైతం అంగీకరించని ఆనాటి సమాజపు కట్టుబాట్లను చేధించి మరీ తెల్లదొరల పాలనను అంతమొందించేందుకు విశాఖ జిల్లా మహిళలు నడుం బిగించారు. పురుషులతో సమానంగా భుజంభుజం కలిపి పోరాటాలకు సిద్ధమయ్యారు. కన్నూమిన్నూ కానని బ్రిటీషు నిర్బంధం కొనసాగుతున్న రోజుల్లో గర్భిణులు సైతం ఆందోళనల్లో అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. కుటుంబాలకు దూరంగా, ఒంటరిగా జైలు జీవితాన్ని అనుభవించారు. కొంతమంది జైళ్లలోనే బిడ్డలకు జన్మనిచ్చారు. ఒకపక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఎదురైన బ్రిటీషు నిర్బంధం, ఆటంకాలు వారిలోని దేశభక్తిని ఏమాత్రం చెదరగొట్టలేకపోయాయి.
ఆంధ్ర రాష్ట్రం మొత్తమ్మీద బ్రిటీషు ప్రభుత్వ నిర్బంధానికి గురై జైలు శిక్ష అనుభవించిన తొలి మహిళ విశాఖపట్నానికి చెందిన దిగుమర్తి జానకీబాయమ్మ కావడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం. దేశస్వాతంత్య్ర పోరాటంలో భాగంగా విశాఖ జిల్లాలో నడిచిన ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన, క్విట్‌ ఇండియా తదితర ఉద్యమాల్లో జిల్లా మారుమూల ప్రాంతాల మహిళలు సైతం చురుకైన పాత్ర పోషించారు. కొన్ని ఉద్యమాలను మహిళలే ముందుపీఠిన ఉండి నడిపించారు. యలమంచిలి, దిమిలి, అనకాపల్లి, విశాఖపట్నం, మాడుగుల తదితర ప్రాంతాల్లో మహిళా ఉద్యమాలు నడిచాయి. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, వరకట్న వేధింపులు వంటి గృహ, సామాజిక హింసలు పెరుగుతున్న నేటి తరుణంలో ఆనాటి మహిళా ఉద్యమ గాథలను మననం చేసుకోవడం అత్యంత ఆవశ్యకం.
విశాఖపట్నంలో జన్మించిన జానకీబాయమ్మ జిల్లాలో జరిగిన జాతీయోద్యమంలో నాయకత్వ పాత్ర పోషించింది. శాసనోల్లంఘన, ఉప్పు సత్యాగ్రహం, రౌలట్‌ బిల్లుకు నిరసనగా నిర్వహించిన సత్యాగ్రహం తదితర అనేక ఉద్యమాల్లో తెగువ ప్రదర్శించింది. గర్భిణిగా ఉన్న సమయంలో సైతం ఆమె ప్రత్యక్ష పోరాటాలను నడపడానికి వెరవలేదు. చివరకు ఇలా ఉండగానే బ్రిటీషు నిర్బంధానికి గురై రాయవేలూరు జైలులో శిక్ష అనుభవించింది. జైల్లోనే ఆమె ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ జైల్లోనే ఏడు నెలలపాటు పెరిగింది.
విద్యార్థి దశ నుంచే బ్రిటీషు వ్యతిరేక ఉద్యమం పట్ల ఆకర్షితులైన జానకీబాయమ్మ జాతీయోద్యమంలో అడుగుపెట్టింది. విశాఖ క్వీన్‌మేరీ హైస్కూల్లో చదువుతుండగా దక్షిణాఫ్రికా సత్యాగ్రహోద్యమానికి, బందరులో జాతీయ కళాశాల స్థాపనకు విరాళాలు వసూలు చేసింది. 1915లో పెళ్లి చేసుకున్న ఆమె అనంతరం జిల్లాలో ఆందోళనకు నాయకత్వం వహించింది. స్వాతంత్య్రయోధులైన ఆమె భర్త దిగుమర్తి రామస్వామి పంతులు ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈమె 1920లో కాకినాడ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. జిల్లాలో ఉప్పు సత్యాగ్రహ శిబిరం ఈమె నాయకత్వంలోనే నడిచింది. ఆమె విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్వహించిన ప్రచారయాత్రల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్రానంతరం ఆమె విశాఖ పురపాలక సంఘ సభ్యురాలిగా రెండుసార్లు ఎన్నికయ్యారు.