Jun 01,2023 22:01

- అన్ని పదవుల నుంచి బర్తరఫ్‌ చేయాలి
- రెజ్లర్లకు వెళ్లువెత్తిన సంఘీభావం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనరు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. మహిళా క్రీడాకారులను వేధించిన బ్రిజ్‌ భూషణ్‌ను అన్ని రాజకీయ, ప్రభుత్వ పదవుల నుంచి బర్తరఫ్‌ చేయాలన్నారు. జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు ధర్నాలు, నిరసన కార్యక్రమాలను గురువారం నిర్వహించాయి. విజయవాడలోని ధర్నా చౌక్‌లో జరిగిన ఈ ధర్నానుద్ధేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు నరహరిశెట్టి నరసింహారావుతో కలిసి మాట్లాడారు. మహిళా క్రీడాకారుల పట్ల బ్రిజ్‌ భూషణ్‌ అనుచితంగా వ్యవహరించడం తగదన్నారు. రెజ్లర్లు న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసం చేస్తున్న పోరాటానికి ప్రతిఒక్కరూ సంఘీభావం తెలపాలన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ చర్య దేశానికే అవమానకరమని అంతర్జాతీయ రెజ్లర్‌ సమాఖ్య వ్యాఖ్యలు చాటిచెబుతున్నాయని తెలిపారు. పరిపాలనాపరమైన చట్టాలను రూపొందించే పార్లమెంటు నూతన భవనం ప్రారంభం రోజున న్యాయం చేయాలని అడిగేందుకు శాంతియుత పద్ధతుల్లో వచ్చిన రెజ్లర్ల పట్ల పోలీసుల తీరు గర్హనీయమని అన్నారు. మహిళా రెజ్లర్లను, వారి మద్దతుదారులపై పోలీసుల లాఠీచార్జి చేయడం, వారిని చితకబాదడం చాలా దారుణమన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జితోగానీ హైకోర్టు న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా అనంతరం బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరుతూ సంతకాలు చేయించిన వినతిపత్రాన్ని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టరు ఢిల్లీరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్వర్డు బ్లాక్‌ రాష్ట్ర అధ్యక్షులు సుందరరామరాజు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, ఎపిరైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, రైతుసంఘం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్‌, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరవింద్‌నాథ్‌, ఎపి కౌలురైతుల సంఘం నాయకులు ఎం హరిబాబు, పి జమలయ్య, అఖిల భారత రైతు సమాఖ్య అధ్యక్షులు ఎం వెంకటరెడ్డి, అఖిల భారత కిసాన్‌ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి హరనాథ్‌, జాగృతి రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి మరీదు ప్రసాద్‌, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి, సిఐటియు రాష్ట్ర నాయకులు కె ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య నాయకులు పి దుర్గా భవాని తదితరులు పాల్గన్నారు.