Jul 30,2021 06:07

దేశంలో పరమత సహనం ఎక్కువ ఉందని అనేక ఘటనలు రుజువు చేశాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఒకరికొకరు ఎంతగానో సహకరించుకున్నారు. ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు ఓ ముస్లిం కుటుంబాన్ని పొరుగునే ఉన్న హిందువులు కాపాడారు. ముస్తఫాబాద్‌ లో ఓ హిందూ కుటుంబాన్ని పొరుగునే ఉన్న ముస్లిం కుటుంబం రక్షించింది. ఎక్కువ మంది ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నా...మతం పేరుతో అప్పుడప్పుడు జరుగుతున్న అల్లర్లు, దుష్ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే...దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
    నిరుద్యోగం, ఆర్థిక వృద్ధి మందగింపు, వాతావరణ మార్పులు, పర్యావరణ సంక్షోభం లాంటి పెద్దపెద్ద సమస్యలను పక్కనబెట్టి దేశంలోని ప్రధాన స్రవంతి మీడియా ఇప్పుడు మత మార్పిడులను అతి భయంకరమైన సమస్యగా చూపిస్తోంది. ముఖ్యంగా దీనిలో టీవీ ఛానళ్ల పాత్ర ఎంతో ఎక్కువగా ఉంది. చిన్నచిన్న ఘటనలను పెద్దగా చూపుతూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ.. అబద్ధాలను నిజం చేస్తూ.. నిజాలను దాచిపెడుతూ ప్రజలను వర్గీకరించే పని చేస్తోంది. తద్వారా అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకునే ఒక పార్టీకి పావుగా మారుతోంది. మత మార్పిడుల వెనక పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని కొన్ని మీడియా సంస్థల విష ప్రచారాన్ని 'ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌' నివేదిక కొట్టిపారేసింది. పెద్ద ఎత్తున సర్వే నిర్వహించి వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం చేసింది. 'ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌' చేసిన సర్వే గణాంకాలను పరిశీలిస్తే ఏది వాస్తవమనేది ఇట్టే అర్థమవుతుంది.
    అమెరికాకు చెందిన 'ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌'కు సర్వేల్లో ఎంతో మంచి పేరుంది. పక్షపాతం వహించకుండా సర్వే నిర్వహించే సంస్థగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ భారతదేశంలో 2019-2020 మధ్యలో పెద్ద ఎత్తున సర్వే నిర్వహించింది. 30 వేల మందిని నేరుగా కలిసి 'మతం, కులం, జాతీయత'పై వారి అభిప్రాయాలు తెలుసుకుంది. 26 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో తిరిగి 17 భాషల్లో ఇంటర్వ్యూలు తీసుకుంది. ఈ సర్వే నివేదికను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదికను గణాంకాలను చూస్తే మత మార్పిడులపై కుట్ర, దుష్ట్రచారం అనేది కేవలం 'రాజకీయ - మీడియా' సృష్టే అని తేటతెల్లమవుతోంది.
 

                                                               పరమత సహనం ఎక్కువే

   భారత జనాభాలో 80 శాతం మంది హిందువులు కాగా, 14 శాతం మంది ముస్లింలు ఉన్నారు. 97 శాతం మంది భారతీయులు తాము దేవుడిని నమ్ముతున్నట్లు చెప్పారు. అయితే అన్ని మతాలవారు పరమత సహనం కలిగి ఉన్నారని ఈ నివేదిక తెలియజేసింది. నిజమైన భారతీయుడు ఇతర మతాలను గౌరవిస్తాడని 84 శాతం మంది తెలిపారని సర్వే పేర్కొంది. అంతేకాకుండా ఇతర మతాలను గౌరవిస్తేనే తమ మతాన్ని సరైన రీతిలో అనుసరిస్తున్నట్టు అని 80 శాతం మంది తెలిపారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు దేశంలో ఉండడం లాభిస్తుందని 53 శాతం మంది చెప్పారు. పరమత సహనం కలిగి ఉన్నామని చాలా మంది చెబుతున్నా.. మతాంతర వివాహాలను వ్యతిరేకించేవారు మాత్రం అధిక సంఖ్యలో ఉన్నారు.
 

                                                                    ప్రచారం కరువు

    దేశంలో పరమత సహనం ఎక్కువ ఉందని అనేక ఘటనలు రుజువు చేశాయి. కోవిడ్‌ మహమ్మారి సమయంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఒకరికొకరు ఎంతగానో సహకరించుకున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రధాన స్రవంతి మీడియా అంతగా ప్రాధాన్యతనివ్వలేదు. ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు ఓ ముస్లిం కుటుంబాన్ని పొరుగునే ఉన్న హిందువులు కాపాడారు. ముస్తఫాబాద్‌ లో ఓ హిందూ కుటుంబాన్ని పొరుగునే ఉన్న ముస్లిం కుటుంబం రక్షించింది. ఎక్కువ మంది ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నా...మతం పేరుతో అప్పుడప్పుడు జరుగుతున్న అల్లర్లు, దుష్ప్రచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే... దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దుష్ప్రచారం చేసే వారి సంఖ్య తక్కువగా ఉన్నా అలాంటి వారినే మీడియా హైలైట్‌ చేస్తుండడంతో సమస్య ఏర్పడుతోంది. అంతేకాకుండా మన రాజకీయ నాయకులు కూడా వారికే వత్తాసు పలుకుతుండడంతో వారి గురించి ఎక్కువ ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా ప్రజల్లో మతం పట్ల ఓ తెలియని భయం నెలకొంటోంది.
 

                                                 హిందువులుగా మారుతున్న వారే అధికం

    'ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌' అడిగిన ఒక ప్రధాన ప్రశ్న ఏమిటంటే మీరు చిన్నప్పుడు ఏ మతంలో పెరిగారు? ప్రస్తుతం ఏ మతంలో ఉన్నారు? అని. అయితే 98 శాతం మంది ప్రజలు చిన్నప్పటి, ప్రస్తుత మతం ఒకే విధంగా ఉందని జవాబు చెప్పారు. అంటే వారి మతం మారలేదు. రెండు శాతం మంది మతాన్ని మార్చుకున్నట్టు భావించినా 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో అది చిన్న సంఖ్యేమీ కాదు. అయితే ఒక మతం నుంచి బయటకు వెళ్తున్న వారు, ఇతర మతాల నుంచి ఆ మతంలోకి వస్తున్న వారు చాలా మతాల్లో ఒకే మాదిరిగా ఉన్నారు. 'ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌' సర్వే ప్రకారం ఇతర మతాల్లోకి వెళ్తున్న హిందువుల సంఖ్య కంటే.. ఇతర మతాల నుంచి హిందువులుగా మారుతున్న వారే అధికంగా ఉన్నారు. చిన్నతనంలో హిందువులుగా ఉండి మతం మారిన వారు 0.7 శాతం ఉండగా, ఇతర మతాల నుంచి హిందువులుగా మారిన సంఖ్య 0.8 శాతముంది. ముస్లింలలో వచ్చీపోయే వారి సంఖ్య 0.3 శాతం సమానంగా ఉంది. సిక్కులు, బౌద్ధుల్లో ఇది 0.1 శాతంగా ఉంది. చిన్న తనంలో ఏ మతాన్ని అనుసరించని 0.1 శాతం పెద్దయ్యాక ఏదో ఒక మతాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఇతర మతాల నుంచి క్రైస్తవులుగా మారుతున్న వారి సంఖ్య 0.4 శాతం ఉండగా, క్రైస్తవం నుంచి ఇతర మతాల్లోకి మారుతున్న వారి సంఖ్య 0.1 శాతంగా ఉంది. ఈ గణాంకాలను చూస్తే మతాంతీకరణ వల్ల ఏదో పెద్ద ప్రమాదం ముంచుకొస్తుందని మనం భావించాల్సిన పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.
 

                                                              'కుట్ర కోణం' ఓ పెద్ద కుట్ర

    మతాన్ని మార్పించడానికి రహస్యంగా ఏదో పెద్ద కుట్ర జరుగుతోందని, 'లవ్‌ జిహాద్‌' పేరుతో ఒక మతం వారు ఇతర మతాల వారిని తమ మతంలోని మార్పించుకుంటున్నారని మీడియా పెడుతున్న గగ్గోలు అంతా బూటకమే అని ఈ రిపోర్ట్‌ ద్వారా తేటతెల్లం అవుతోంది. కుట్ర కోణంగా ఓ వర్గం మీడియా చేస్తున్న ప్రచారం ప్రజల్లో భయాన్ని నెలకొల్పడానికే అని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ భయం ద్వారా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చడానికే వారి ప్రయత్నమని తెలుస్తోంది. దేశంలో బలవంతపు మత మార్పిడులు కొన్ని ఉన్నా అవి వ్యక్తిగత కేసులు మాత్రమే. వేలు, లక్షల్లో మత మార్పిడులు చేసేందుకు కుట్ర జరుగుతున్నట్టు మీడియా చూపిస్తున్నట్టు ఎక్కడా నిరూపితం కాలేదు. అలాంటిదేమైనా జరిగి ఉంటే ఇప్పటికే ఆ విషయం స్పష్టమై కనిపించేది.
    గతేడాది కాన్పూర్‌ లో 14 కేసులకు సంబంధించి ఒక ప్రత్యేక పరిశోధనా బృందం పరిశోధన చేసింది. అయితే దీని వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే కనీస రుజువులు వారికి లభించలేదు. బలవంతపు మార్పిడులను తప్పు పట్టాల్సిందే. ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంలో ఏదైనా మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంది. దీన్ని నిరోధించేందుకు, నిందితులను శిక్షించేందుకు అనేక చట్టాలు ఉన్నాయి. ఐపిసి లో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. ఒకటి, రెండు ఘటనలను దృష్టిలో ఉంచుకొని కోట్లాది మంది స్వేచ్ఛను హరించలేం కదా. ఇక్కడ ప్రజలు చేయాల్సింది ఒక్కటే. మతం పేరుతో రాజకీయాలు చేసే వారిని గుర్తించి, అలాంటి వారిని, అలాంటి పార్టీలను దూరం పెట్టడమే. తద్వారానే మనం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, పరమత సహనాన్ని రక్షించుకోగలం.
 

/ వ్యాసకర్త సెల్‌ : 9640466464/
ఫిరోజ్‌ ఖాన్‌

ఫిరోజ్‌ ఖాన్‌