Aug 08,2022 00:53

అనకాపల్లి పట్టణంలో 75 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి - అనకాపల్లి : మతోన్మాద జాడ్యం నుంచి దేశాన్ని రక్షించుకోవాలని సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం పిలుపునిచ్చారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన నేపథ్యంలో 75 అడుగుల జాతీయ జెండాతో అనకాపల్లి పట్టణంలో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. దొడ్డి రామునాయుడు కార్మిక కర్షక నిలయం నుంచి నెహ్రూ చౌక్‌ జంక్షన్‌ మీదుగా రామచంద్ర థియేటర్‌ వరకు సిఐటియు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్య్రోద్యమంలో కనీస పాత్ర నిర్వహించని, బ్రిటిష్‌ వారి అడుగులకు మడుగులొత్తిన ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ ప్రచారక్‌ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి సర్కారు ఉత్సవాలను నిర్వహించడం చారిత్రక విడ్డూరంగా ఉందన్నారు. ఎందరో ప్రాణ త్యాగాలతో వచ్చిన స్వాతంత్య్రాన్ని నేడు బిజెపి పాలకులు కుల, మత వైషమ్యాలతో అప్రతిష్టపాలుజేస్తున్నారన్నారు. ఘర్షణలు సృష్టిస్తున్నారని తెలిపారు. 1920లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ ఆది నుంచీ బ్రిటిష్‌ సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా ఎన్నో తరగతులను సమీకరించి ఉద్యమాలు నిర్వహించిందన్నారు. నిజాం సంస్థానంలో వెట్టి చాకిరీ నిర్మూలనకు, భూస్వామ్య విధానం రద్దుకు జరిగిన తిరుగుబాటులో నాలుగు వేల మంది యోధులు ప్రాణాలను అర్పించారన్నారు. అలాగే కేరళలో పున్నప్రా వాయిలార్‌, బెంగాల్‌లో తెభాగా, మహారాష్ట్రలో వర్లీ పోరాటాల ఫలితంగా జమీందారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు. కానీ నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు, నగదీకరణ విధానాలతో కుబేరులకు లక్షలాది కోట్ల రూపాయలను రాయితీగా అందిస్తోందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేస్తోందని తెలిపారు. నూతన విద్యా విధానాన్ని బలంగా రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ గాంధీని చంపిన గాడ్సే గురువైన సావర్కర్‌ను జాతిపితగా చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. రాజ్యాంగం చెప్పిన ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ జమ్మూ కాశ్మీర్‌ విషయంలో బిజెపి ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛపై నిరంతరం దాడులు నిర్వహిస్తోందన్నారు. తప్పుడు కేసులతో మేధావులను, పాత్రికేయులను జైలుపాలు చేస్తోందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను తన గుప్పెట్లో ఉంచుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు, అధ్యక్షులు ఆర్‌.శంకరరావు, సిపిఎం మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, రైతు సంఘం జిల్లా కోశాధికారి నాయనబాబు పాల్గొన్నారు.