Oct 12,2021 20:05

మనమంతా మనుషులం. మనది లౌకికవాదం. కొంతమంది స్వార్ధ ప్రయోజనాల కోసం మన మధ్య చిచ్చుపెట్టి విడదీయాలని చూస్తున్నారు. భాష ఏదైనా, మతమేదైనా మనమంతా మనుషులం. అందుకు సాక్ష్యంగా మనదేశంలో నిత్యం ఎన్నో ఉదంతాలు జరుగుతూనే ఉంటాయి. మనదేశంలో మతసామరస్యం ఎప్పటికీ నిలిచి వుంటే సజీవ సాక్షం.
దుర్గాపూజకు పశ్చిమబెంగాల్‌ ఎంతో ప్రసిద్ధి గాంచింది. అటువంటి చోట ఓ చిన్న కుగ్రామంమైన సుక్తాబరిలో మెజార్టీ వర్గం ముస్లింలు, మైనార్టీలు హిందువులు. అయినా ప్రతి ఏడాది దసరా సందర్భంగా నిర్వహించే దుర్గా పూజా అక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. వందల మంది ముస్లిం సోదరుల ప్రోత్సాహంతో వైభవంగా వేడుక నిర్వహిస్తారు.
కోచ్‌ బెహర్‌ నగరానికి శివారు గ్రామమైన ఇక్కడ 55 ఏళ్లుగా దసరా పురస్కరించుకుని సామాజిక దుర్గాపూజ నిర్వహిస్తున్నారు. నగరాల్లో విశేషంగా జరిపే దసరా వేడుకలంత ప్రచారం జరగకపోయినా హిందూ, ముస్లిం స్నేహభావానికి ప్రతీకగా ఈ వేడుక నిలుస్తుంది. ఈ గ్రామంలో ప్రతిరోజూ వేలాదిమంది సందర్శించే మార్కెట్‌ ఉంది. అక్కడ మసీదు, మదరసా సమీపంలోనే ఓ హిందూ దేవాలయం ఉంది. మార్కెట్లో మొత్తం 400 దుకాణాలు ఉంటే ఐదు మాత్రమే హిందువులకు చెందినవి.
'మేమంతా ఒక్కటిగా ఈ వేడుకను నిర్వహిస్తాం. ఇక్కడ మతపరమైన విభేదాలు తలెత్తడం ఎప్పుడూ చూడలేదు' అంటారు సూక్తబరి బజార్‌ బైబసాయి సమితి అధ్యక్షుడు అబుల్‌ హుస్సేన్‌. 'తరతరాలుగా మేమంతా ఇక్కడే నివసిస్తున్నాం. ఎప్పుడూ మేము ఇతర మతాలకు చెందిన విభిన్న వ్యక్తులమ'ని భావించలేదంటారు స్థానిక వ్యాపారి మనోజ్‌సాహ్.
'మత విద్వేషాలు రెచ్చగొట్టే వారంతా సూక్తబరికి ఒక్కసారైనా రావాలి. ఇక్కడ ముస్లింలందరి నుంచి మాకు అపారమైన సహాయం లభిస్తుంది. కాబట్టే దుర్గాపూజను నిర్వహించగలుగుతున్నాం' అని ఈ ఏడాది పూజా కమిటీ కార్యదర్శి హరినాథ్‌ అంటున్నారు. 'ముస్లింలు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. దుర్గాపూజ సందర్భంగా మేము చందా వసూలు చేస్తుంటే మమ్మల్ని ప్రోత్సహిస్తారే గాని ఎప్పుడూ వ్యతిరేకించలేదం'టారు హరినాథ్‌ భార్య మాలతి.
అలాగే గజోల్‌ టాక్సీ స్టాండ్‌లో 2007 నుంచి నిర్వహిస్తున్న దుర్గా ఉత్సవం కూడా ఇదే కథ చెబుతుంది. పేదరికంలో ఉన్న కొంతమంది హిందువుల కోసం ఇక్కడ ముస్లిం వ్యక్తి ఆధ్వర్యాన దుర్గా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 'టాక్సీ స్టాండ్‌ ఉత్సవ్‌ కమిటీ సెక్రటరీ బాబీ అహ్మద్‌ చొరవ వల్లే ఈ పూజా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం' అంటారు కమిటీ ప్రెసిడెంట్‌ శంకర్‌ దత్‌. అహ్మద్‌ భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు సమీప ఇంగ్లీష్‌ బజార్‌లో నిర్వహించే కాళీ పూజ ఖర్చును కూడా భరిస్తాడ'ని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కలకత్తా సిలిగురిలో కూడా 47 ఏళ్లుగా హిందూ ముస్లిం ఏకమై దుర్గాపూజను నిర్వహిస్తున్నారు. ఇంకా అనేక చోట్ల ఇటువంటి దృశ్యాలు మనకు కనబడతాయి.
మతసామరస్యం వెల్లివిరిసే ఇటువంటి సంఘటనలు మనదేశంలో కోకొల్లలు. 'దేశమంటే మట్టి కాదోరు..దేశమంటే మనుషులోరు' అను గురజాడ సూక్తిని ఇనుమడింపజేసే మతసామరస్యం పరిఢవిల్లే మనదేశంలో మతాన్ని ప్రేమించేవారు, స్వచ్ఛంగా ఆచరించేవారు, హింసను ప్రేరేపించరు. అసమ్మతిని తెలియజేయరు.