Nov 22,2020 00:23

లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తున్న మంత్రి కన్నబాబు తదితరులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌
మత్స్య సంపద ఉత్పత్తిలో రాష్ట్రంలోనే విశాఖ జిల్లా అగ్రస్థానంలో ఉందని, వేలాది మంది మత్స్యకారులు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిర్మించిన 'ఫిష్‌ కియోస్క్‌'ను ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వర్చువల్‌ సమావేశం ద్వారా ప్రారంభించారు. విశాఖలోని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ను రూ.100 కోట్లతో ఆధునికీకరణ చేస్తామన్నారు. అచ్యుతాపురం మండలం పూడిమడక తీర ప్రాంతం వద్ద రూ.300 కోట్లతో కొత్తగా ఓడ రేవును నిర్మిస్తామని, ఫిష్‌ మార్కెట్‌, ఫిష్‌ డ్రైవింగ్‌, ప్లాట్‌ ఫారం, నెట్‌ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో రూ.37 కోట్లతో ఆక్వా క్వారంటైన్‌ ఫెసిలిటీ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వైఎస్‌ఆర్‌ భరోసా కింద జిల్లాలో 20,273 మంది మత్స్యకారులకు రూ.20.27 కోట్లు చెల్లించామని తెలిపారు. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.5లక్షలు, బీమాగా రూ.5 లక్షలు, వెరసి రూ.10 లక్షలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ వినరుచంద్‌, మత్స్యశాఖ జెడి ఫణి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట : విజయసాయిరెడ్డి
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. శనివారం మత్స్యకార యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్‌ ఆధ్వర్యంలో వైశాఖి జల ఉద్యానవనంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విజయసాయిరెడ్డి ముందుగా మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిపి కేక్‌ కట్‌ చేశారు. సమాఖ్య నాయకులు సింహాద్రి అప్పన్న, వాసుపల్లి రాము, సురపతి నర్సింగ్‌, బడే ఎల్లాజీ,గనగళ్ల రాజేష్‌ పాల్గొన్నారు.
భీమునిపట్నం : మత్స్యకారులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని మత్స్యకార సంఘాల నాయకులు ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. జివిఎంసి నాలుగో వార్డు పరిధి చేపలుప్పాడ బహుళ సామాజిక భవనం ఆవరణలో శ్రీ ఉత్తరాంధ్ర మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు సిహెచ్‌.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. 678 మందికి దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు.
పాయకరావుపేట: రఘుపతి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సభలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చోడిపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.