Apr 07,2021 21:21

న్యూఢిల్లీ : చిన్న వ్యాపారులు, ఔత్సాహికవేత్తలకు ఇచ్చే ముద్రా రుణాల జారీలో తగ్గుదల చోటు చేసుకుంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో వీటి జారీ 21 శాతం పతనమై రూ.2.7 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఏడాది 2019-20లో ప్రధాన మంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) కింద రూ.3.4 లక్షల కోట్లు, 2018-19లో రూ.3.2 లక్షల కోట్ల చొప్పున అందజేశారు. ఈ పథకం కింద గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చి 19 నాటికి 4.2 కోట్ల మందికి రూ.2.7 లక్షల కోట్ల అప్పులిచ్చినటుల బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చిన్న వ్యాపారులకు మద్దతునిచ్చేందుకు ఎలాంటి పూచికత్తు లేకుండా రూ.10 లక్షల లోపు రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో 2015లో ఈ పథకాన్ని ప్రారంభించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సగటు రుణ విలువ జారీ రూ.52,000గా ఉంది. ఈ వర్గాలకు ఇచ్చే రుణాల్లోనూ మొండి బాకీలు కేవలం 2.51 శాతంగా ఉన్నాయి.