Apr 07,2021 09:13

గుంటూరు : మూడు కాళ్లతో జన్మించిన వింత శిశువుకు గురటూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు అరుదైన సర్జరీ చేసి విజయవంతమయ్యారు. వివరాల్లోకెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం శెట్టివారిగూడేనికి చెందిన మోహనరావు, వెంకటేశ్వరమ్మ దంపతులకు గత నెల 4 న నూజివీడులో ఆడపిల్ల జన్మించింది. శిశువుకు పుట్టుకతో మూడు కాళ్లు ఉన్నాయి. నడుము భాగం నుంచి మూడో కాలు ఏర్పడింది. వైద్యుల సూచన మేరకు.. ఆ చిన్నారిని గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు శిశువుకు త్రీడీ ఎమ్మారై, త్రీడీ సిటీస్కాన్‌ చేసి నడుము లోపలి భాగం నుంచి మూడో కాలు వచ్చినట్లు నిర్థారించారు. మూడో కాలి వద్ద పురుష జననాంగాలు ఏర్పడి, రెండు కాళ్లకు సంబంధించిన నరాలు మూడో కాలికి అతుక్కుని ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మార్చి 31 న న్యూరో విభాగం వైద్యులు శేషాద్రిశేఖర్‌, హనుమ శ్రీనివాసరెడ్డి శిశువుకు అరుదైన సర్జరీ చేసి మూడో కాలును విజయవంతంగా తొలగించారు.
   ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇటీవల రూ.1.5 కోట్ల ఖరీదు చేసే అత్యాధునిక లైకా మైక్రోస్కోప్‌ వైద్య పరికరాన్ని న్యూరోసర్జరీ వైద్య విభాగానికి అందించిందని తెలిపారు. ఈ పరికరం ద్వారానే శిశువుకు ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేయగలిగామని పేర్కొన్నారు. ఇది వెన్నుకు సంబంధించిన ఒక రకమైన వైకల్యమని, ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. దీనిని వైద్య పరిభాషలో 'లంబార్‌ మైలో మెనింగోసీల్‌ విత్‌ ట్పైపీడస్‌ డిఫార్మటీ'గా పిలుస్తారని వివరించారు. శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యులను అభినందించారు. ఎంతో ఖర్చుతో కూడుకున్న శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేసినందుకు పాప తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.