Mar 19,2023 19:41

మాట్లాడుతున్న రంగారావు

ప్రజాశక్తి- బొబ్బిలి : ఉత్తరాంధ్రతోపాటు తూర్పు, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఫలితాలతో ముఖ్యమంత్రి జగన్‌కు కనువిప్పు కలగాలని మాజీ మంత్రి సుజరు కృష్ణ రంగారావు అన్నారు. పట్టభద్రులు రాజ్యాంగ స్ఫూర్తిని విలువలను జగన్‌కి తమ ఓటుతో తెలియజేసారని సుజరు తెలిపారు. జగన్‌ అరాచకాలు, విధ్వంసక చర్యలతో పాలన సరికాదని ఓటరు సరైన రీతిలో స్పందన తెలిపారని అన్నారు. మూడు రాజధానాలంటూ మోసం చేసే ప్రకటనలు జగన్‌ ప్రభుత్వం ఎంతగా చేసినా ఉత్తరాంధ్ర ఓటర్లు ఈ ఎన్నికల ఫలితాలతో బుద్దిచెప్పారని స్పష్టం చేశారు. అటు తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల సహితం, జగన్‌ మోసకారి ప్రకటనలపై ఓటుతో తగిన రీతిలో స్పందించారన్నారు. జగన్‌ మూడు రాజధానుల మూడు కళ్ళ సిద్ధాంతం అంతా కపటనాటకమేనని ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాయలసీమ ఓటర్లు సహితం తమ ఓటుతో స్పందించారని అన్నారు. ప్రధానంగా పశ్చిమ రాయలసీమలో భాగమైన ముఖ్యమంత్రి సొంత అడ్డ పులివెందుల కడపలో కూడా జగన్‌ పై వ్యతిరేకత మొదలైందనే విషయం ఈ ఎన్నికలు రుజువు చేయసాయన్నారు. జగన్‌ విద్యాంసక చర్యలు, తుగ్లక్‌ నిర్ణయాలు అస్తవ్యస్త పాలనపై జగన్‌ సొంత ప్రాంత వాసులు ఓటుతో స్పందించిన తీరు అభినందదాయకమని రంగారావు తెలిపారు. ప్రస్తుత పట్టభద్రుల ఫలితాలు భవిష్యత్తు ఎన్నికల ఫలితాలను నిర్దేశించనున్నాయని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా విజయం సాధించిన చిరంజీవిరావుకు, శ్రీకాంత్‌కు, రామ్‌ గోపాల్‌కు అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్రంలో అన్ని వర్గాల్లోనూ ఆనందం నింపిందన్నారు. ఈ విజయంతో రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని తెలుగుదేశం క్యాడర్‌కు పిలుపు నిచ్చారు.