Jun 10,2021 20:52

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల అంశంలో మరో ఆలోచనకు తావులేదని, ప్రస్తుతం దీనిపై న్యాయ ప్రక్రియ కొనసాగుతోందని, ఏ క్షణమైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభం కావొచ్చని ఎపి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మూడు రాజధానుల అంశంపై కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికేంద్రీకరణ బిల్లుతోనే విశాఖ రాజధాని ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎక్కడ్నించైనా సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న విషయం అందరికీ అర్థమైందని పేర్కొన్నారు.టిడిపి అధినేత చంద్రబాబుకు రాజకీయాలే కావాలని, అందుకే పోలవరం, వ్యాక్సినేషన్‌ వంటి అంశాలపై సిఎం జగన్‌ ఢిల్లీ వెళితే తన మీడియాతో అడ్డదిడ్డంగా రాయిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తి పెంచాలని దేశంలో ఆర్థిక నిపుణులంతా సూచించిన మేరకు రాష్ట్రంలో తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రూ.1.35లక్షల కోట్ల నగదు ప్రజలకు బదిలీ చేసిందని తెలిపారు. ఆస్తిపన్ను పెంచిందేమీ లేదని, కార్పొరేషన్‌ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందని, దీనిపై చట్టం చేశామని కౌన్సిల్‌లో తీర్మానం ఆమోదించాలని చెప్పారు. ఇప్పుడున్న ఆస్తి పన్నుకు అదనంగా 15శాతం మాత్రమే పెరుగుతుందన్నారు. పేదల వరకూ చూస్తే 375 చదరపు అడుగుల ఇంటికి, స్థలానికి సంవత్సరానికి రూ.50 మాత్రమే పెరుగుతుందన్నారు.

ఆస్తిపన్ను పెంచొదు : సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు
సిపిఎం గ్రేటర్‌ విశాఖ నగర కార్యదర్శి, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌.బిగంగారావు, వార్వా ప్రధాన కార్యదర్శి బిబి.గణేష్‌ గురువారం మంత్రి బత్స సత్యనారాయణను కలిసి ఆస్తిపన్ను పెంపు సరికాదని, కరోనా కాలంలో ప్రజలపై భారాలు మోపొద్దంటూ వినతిపత్రం అందజేశారు.