Jan 23,2022 08:12
  • 89 వేల మందికే భరోసా
  • లక్షల్లో కౌలు రైతులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా వరుసగా మూడవ ఏటా కౌలు రైతులకు నామమాత్రంగానే దక్కింది. రాష్ట్రంలో లక్షలాదిగా కౌలు రైతులుండగా కేవలం 89 వేల మందికే పెట్టుబడి సాయం అందింది. 2020-21లో నాలుగు లక్షల కౌలు రైతులకు గుర్తింపు కార్డులు (సిసిఆర్‌సి) జారీ చేయగా, ఏడాదిలో మూడు విడతల్లో భరోసా రూ.1,3500 నిమిత్తం భూమి లేని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ కౌలు రైతులను అర్హులుగా ఎంపిక చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులే తక్కువ ఇవ్వగా, వాటిలోనూ ఒక వంతుకు సైతం సాయం దక్కలేదు. భరోసా పథకం మొదలైన నాటి నుండి కౌల్దార్లకు సర్కారు మొండి చెయ్యే చూపిస్తోంది. తొలేట 2019లో 63,023 మంది, రెండవ సంవత్సరం 2020లో 69,276 మంది భరోసాకు అర్హత సాధించగా, ముచ్చటగా మూడవ ఏట కూడా అదే ధోరణి కొనసాగింది. మూడవ సంవత్సరం 89,877 మంది భరోసాకు ఎంపిక చేశారు. అనేక వడ పోతల తర్వాత అర్హత సాధించినా, వారందరికీ సక్రమంగా పేమెంట్‌ జరగలేదు. ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌, సిసిఆర్‌సి అప్‌లోడ్‌ ఇత్యాది సాంకేతిక కారణాల మూలంగా సొమ్ము జమ కాలేదు. ఉన్నంతలో గుంటూరులో అత్యధికంగా, చిత్తూరులో అత్యల్పంగా లబ్ధి పొందారు.
 

                                                                     ఎందుకిలా..?

పంటల సరళి, వ్యవసాయ కార్పొరేటీకరణ వలన రాష్ట్రంలో కౌలు సేద్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎపిలో 32 లక్షల కౌలు రైతులున్నారని ప్రభుత్వమే చెబుతోంది. స్వంత భూమి కలిగిన వారితో పాటు కౌలు రైతులందరికీ భరోసా ఇస్తామంది వైసిపి. అధికారంలోకొచ్చాక 15 లక్షల కౌల్దార్లకు సాయమని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. భూమి లేని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు ఆరు లక్షల మందికి కచ్చితంగా భరోసా అందిస్తామంది. పథకం మొదలై మూడేళ్లయినా లక్ష మార్క్‌్‌ చేరలేదు. కౌలు రైతుల గుర్తింపులోనే సమస్య ఉంది. పంట సాగుదారు హక్కు చట్టం (సిసిఆర్‌సి) ప్రకారం కార్డు పొందాలంటే భూయజమాని రాతపూర్వక ఆమోదం తప్పనిసరి. దాంతో సిసిఆర్‌సిల జారీ ఒక పట్టాన సాగట్లేదు. సర్కారు ఎంతగా స్పెషల్‌ డ్రైవ్‌లని చెప్పినా, గ్రామ సచివాలయ స్థాయిలో గుర్తింపు అన్నా పెద్దగా ప్రయోజనం లేదు. పైగా బినామీలు, అనర్హులు సిసిఆర్‌సిలు పొంది ప్రభుత్వ పథకాలు అనుభవిస్తున్నారు.
 

                                                               దృష్టిలోనే వివక్ష

కౌలు రైతులకు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలోనే లోపం ఉంది. కేంద్రం మొత్తానికే కౌల్దార్లకు పెట్టుబడి సాయం నిరాకరించింది. పిఎం కిసాన్‌తో కలిపి భరోసాను అమలు చేసే క్రమంలో రెండేళ్ల నుండి ఎపి సర్కారు ఖరీఫ్‌కు ముందే తన వాటాను భూయజమానులకు విడుదల చేస్తోంది. కౌలు రైతులకు ఎప్పుడో అక్టోబర్‌, నవంబర్‌లో ఒకేసారి రెండు విడతలు, జనవరిలో మూడవ విడత సొమ్ము జమ చేస్తోంది. వాస్తవంగా భూమిపై శ్రమ చేసే వారికే జాప్యం చేస్తోంది. ఇచ్చేదే తక్కువ మందికి కాగా దాని కోసం కౌల్దార్లు నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.