May 14,2022 09:26

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన రోజున పాలకులు చెప్పినట్టు అక్కడేమీ స్వేచ్చా పవనాలు వీయడం లేదు. అందమైన కాశ్మీరం నిత్యం రక్తమోడుతోనేవుంది. కాశ్మీర్‌ పండిట్‌ హత్య మరువకముందే ఉక్రమూకలు మరో కానిస్టేబుల్‌ను పొట్టనపెట్టుకున్నారు. పుల్వామాలో జిల్లాలో గుడోర వద్ద శుక్రవారం ఉదయం రియాజ్‌ అహ్మద్‌ థోకర్‌ అనే పోలీసును ఉగ్రవాదులు కాల్చి చంపేశారని అధికారులు తెలిపారు. కాల్పులు జరిగినప్పుడు తీవ్ర గాయాలతో ఉన్న అతణ్ణి సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. గడిచిన 24 గంటల్లో ఇది రెండో ఉగ్రవాద దాడి కావడం గమనార ్హం. కాగా బందిపోరా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. బ్రార్‌ అరగం వద్ద ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. చనిపోయిన ముష్కరుల్లో ఇద్దరిని గత గురువారం బుద్గాం జిల్లాలో కాశ్మీర్‌ పండిట్‌ హత్యకు బాధ్యులుగా గుర్తించారు.