
ప్రజాశక్తి-పెద్దవడుగూరు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో విజయం సాధించిన నూతన సర్పంచి రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించడంతో ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు. మండలంలోని భీమునిపల్లి గ్రామానికి చెందిన ఎల్.చంద్రమ్మ కుమారుడు వైసిపి మండల సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డితో కలిసి భీమునిపల్లి నుంచి రావులుడికి గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంపచెట్లను జెసిబితో సోమవారం తొలగించారు. ముళ్ల పొదలు పెడగడంతో ఈ రోడ్డు గుండా ప్రయాణం చేసేందుకు వాహనదారులు ఇబ్బందులు పడేవారు. నూతన సర్పంచి ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూడకుండా తనకు ఓట్లు వేసిన ప్రజలకు కానుకగా ఇలాంటి మంచి పనులు చేపట్టడం హర్షణీయమని పలువురు కొనియాడారు. ఈ సర్పంచి స్ఫూర్తితో నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఇలాంటి మంచి పనులు చేసి ప్రజాభిమానాన్ని చూరగొనాలని ప్రజలు కోరుతున్నారు.